అమరావతి : జిల్లాలోని సమస్యల ను అధికారుల ద్రుష్టికి తీసుకుని వచ్చి పోరాటం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. శక్తి కేంద్రాల పరిధి అంటే అయిదు పోలింగ్ కేంద్రాల పరిధిలొ సమస్యలను గుర్తించి స్థానికులను సమీకరించి ఉద్యమం చేయడం ద్వారా పోలింగ్ బూత్ స్ధాయిలో పార్టీ పటిష్ఠతకు వీలుకలుగుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గోని సోము వీర్రాజు బిజెపిశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమానికి శక్తి కేంద్రాల పరిధిలో విశేష సంఖ్యలో స్థానికులను సమీకరించి నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి సాధ్యపడుతుందన్నారు.
ఏపీలో రోడ్లన్నీ గోతులమయం : రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా గోతులమయం అని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రోడ్లను బాగు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, గ్రామ సచివాలయ భవనాలు అన్నీ కేంద్ర నిధులతో కట్టినవే అని చెప్పారు. కుటుంబ పార్టీల పాలనలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అబద్ధాలు రాజ్యమేలుతున్నాయన్నారు. కుటుంబ పార్టీలు బలోపేతం కావడానికి రాష్ట్రాన్ని బలహీనం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, సిలికా మైనింగ్ దోపిడి జరుగుతోందని అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో సిలికా కోసం రైతుల భూములు బలవంతంగా దున్నుతున్నారని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.