అమరావతి : సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ప్రైమ్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి కలిశారు. ప్రైమ్ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో అమెరికాలోని 14 రాష్ట్రాలలో 46 ఆసుపత్రులు నిర్వహిస్తూ, యూఎస్‌లోని టాప్ టెన్ వైద్య వ్యవస్ధల్లో ఒకటిగా ప్రైమ్ కేర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సీఎంతో సమావేశం అనంతరం డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి మాట్లాడుతూ సీఎంతో జరిగిన సమావేశం మంచి సహృద్బావ వాతావరణంలో జరిగింది, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు అలాగే నా సహాధ్యాయి. మేం వివిధ అంశాలపై చర్చించాం. అందులో ప్రధానంగా ఏపీలో ఆరోగ్య రంగంపై చర్చ జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఏపీలో 98 శాతం డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకం జరగడం గొప్ప విషయం. ఏపీకి డిజిటల్ ఎక్స్‌రే మిషన్లు, అత్యాధునిక మెడికల్ ఎక్విప్మెంట్ను ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నా. కోవిడ్ సమయంలో కూడా అతి తక్కువ వ్యవధిలో 1500 ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు ఇచ్చాను. పేదలకు ఇళ్ళు, ఆరోగ్యశ్రీ, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో చాలా చక్కగా సీఎం అభివృద్ది చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ ప్రసాద్ జి.రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ రాఘవరెడ్డి, మెడికల్ అడ్వైజర్ ఎన్నారై ఎఫైర్స్ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి, ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.