*పదిరోజుల దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
* టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
తిరుమల : సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి చెప్పారు.ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ , జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి , అదనపు ఈవో వీరబ్రహ్మం , జేఈవో సదా భార్గవి, టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ , జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఇతర అధికారులతో మంగళవారం సాయంత్రం తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష జరిపారు . అనంతరం చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో దాదాపు 92 కౌంటర్ల ద్వారా. సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు : జనవరి 1, 2 నుండి 11వ తేదీ వరకు కలిపి మొత్తం 2.05 లక్షల టికెట్లు విడుదల చేశాం.
వెనుకబడిన ప్రాంతాల వారికి వైకుంఠ ద్వార దర్శనం : రాష్ట్రంలోని గిరిజన , వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పేదవర్గాల వారికి రోజుకు వెయ్యి మంది చొప్పున 10 రోజులకు కలిపి సుమారు 10 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం.
మాస్క్ ధరించి రావాలి : కోవిడ్ మళ్ళీ వ్యాపిస్తున్న పరిస్థితులు నెలకొన్నందువల్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ మార్గ దర్శకాలు జారీ చేశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నందువల్ల అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.