ఘన నివాళులర్పించిన రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
రాజకీయాలలోకి రావాలనుకునే యువతకు ఆయనొక రోల్ మోడల్ : మల్లాది విష్ణు
విజయవాడ : పేద ప్రజల కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో నిర్వహించిన వర్థంతి కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అభిమానులు నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. నిరుపేదల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటాలు చేసి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిన మహావ్యక్తి వీఎం రంగా అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కొనియాడారు.
సాయం కోరి వచ్చిన వ్యక్తికి నేనున్నా అంటూ భరోసా కల్పించేవారన్నారు. భారీ వర్షాలు, వరదలకు నగరంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురైన సమయంలో దగ్గరుండి బాధితులను ఆదుకున్నారన్నారు. సమాజం పట్ల బాధ్యతగా ఉండేలా విద్యార్థి సంఘాల్లో అవగాహన కల్పించిన నేత వీఎం రంగా గారని మల్లాది విష్ణు అన్నారు. రాజకీయాలలోకి రావాలనుకునే యువతకు ఆయనొక రోల్ మోడల్ గా అభివర్ణించారు. 1980 నుంచి 1989 మధ్య దాదాపు దశాబ్ద కాలంపాటు ఆయన నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి రంగా ఆశీస్సులు ఎంతగానో ఉన్నాయన్నారు. పేదలకు అండగా నిలిచేతత్వమే రంగా కి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిపెట్టిందన్నారు.
తెలుగుదేశం నిరంకుశ విధానాలపై తిరుగులేని పోరాటం : 1983 నుంచి 1989 వరకు నాటి తెలుగుదేశం ప్రభుత్వ నిరంకుశ విధానాలపై వంగవీటి మోహన రంగా గారు అలుపెరుగని పోరాటం చేశారని మల్లాది విష్ణు అన్నారు. అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్డుపై ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తుచేశారు. తనపై నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని దాష్టీకాలకు తెగబడినా ఎక్కడా వెనుకంజ వేయకుండా వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. ప్రజల కష్టాలను సొంత కష్టాలుగా పోరాడి విజయవాడ నగర ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. శిరోముండనం, లాకప్ డెత్ లు వంటి దుశ్చర్యలకు తెగబడుతూ నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం పౌరుల హక్కులను కాలరాస్తున్న తరుణంలో ప్రజలకు అండగా నిలిచారన్నారు.
నాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలీస్ బిల్లు తీసుకొచ్చిన సమయంలో పేదల తరపున పోరాటాలు చేసిన ఏకైక నాయకులు రంగా అని చెప్పుకొచ్చారు. జైలులో ఉండి కూడా కార్పొరేటర్ గా గెలుపొందిన వ్యక్తి విజయవాడ చరిత్రలో ఒక్క రంగానే అని వ్యాఖ్యానించారు. కనుకనే కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. విజయవాడ నగర ప్రజలు వంగవీటి మోహన రంగా సేవలను ఎన్నటికీ మరువరని మల్లాది విష్ణు అన్నారు. ఏళ్లు గడుస్తున్నప్పటికీ రంగా పేరు మీద వాడవాడలా అభిమానులు నేటికీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే రంగా కి అభిమానులు అర్పించే నిజమైన నివాళిగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, వంగవీటి మోహన రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.