వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి
విజయవాడ : రానున్న ఎన్నికల్లో ఓట్లు కోసమే ఉత్తరాంధ్రలో టీడీపీ వెనుకబడిన వర్గాల జపం చేస్తోందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయ రెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన పలు అంశాలు వెల్లడించారు. 2014లో కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చినప్పుడు విజయనగరం రాజుని, సుజనా చౌదరిని మంత్రుల్ని చేశారే తప్ప ఒక్క బీసీకి కూడా అవకాశం కల్పించలేదని గుర్తుచేశారు. బీసీలపై తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి ఎలాంటిదో ఢిల్లీ వరకు తెలుసని అన్నారు. బీసీలపై చిత్తశుద్ధి అంటే వైఎస్సార్సీపీ దేనిని అన్నారు. సొంత పార్టీకి విశ్వాసంగా లేని అదినేత దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు. అయితే అతనిని పూర్తిగా నిందించలేమని, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ తుడిచిపెట్టుకుపోయిన తరువాత తెలంగాణలోని ఖమ్మం వంటి కొన్ని ప్రాంతాల్లో పార్టీని పునర్నిర్మించుకోవలసిన అవసరం అతనికి ఉందని అన్నారు. రానున్న 2023లో టెలీకాం, ఇతర సేవారంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. భారతదేశంలో కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రత్యేకించి స్వల్పకాలిక ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. యువత ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. 2022 కంటే 2023 ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మెరుగ్గా ఉంటుందని అన్నారు.