కడియపులంక ఘటనను సుమోటోగా స్వీకరణ
రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో చోటుచేసుకున్న ప్రేమోన్మాది దాడి ఘటనను ‘రాష్ట్ర మహిళా కమిషన్’ సుమోటోగా స్వీకరించింది. ఈ దాడిపై రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ కడియపులంకకు చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధిస్తూ రెండ్రోజుల కిందట యువతి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతితో పాటు, ఆమె అక్క, తల్లిపై సుత్తితో దాడిచేసి గాయపర్చాడు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ రెడ్డి కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత మహిళల ఆరోగ్యం మెరుగయ్యేవరకు మహిళా శిశుసంక్షేమ శాఖ పర్యవేక్షించాలని స్థానిక అధికారులకు ఆమె సూచనలిచ్చారు. వారు త్వరగా కోలుకునేలా మెరుగైన అత్యవసర వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ఆమె కోరారు.
ఈ ఘటనపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో కర్రి జయశ్రీరెడ్డి మాట్లాడారు. ప్రేమోన్మాదిని వెంటనే అరెస్టు చేసి కఠినచర్యలు చేపట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కర్రి జయశ్రీరెడ్డి ఆదేశించారు. దాడి ఘటనకు సంబంధించి కేసు రిజిస్టర్ చేశామని, ప్రేమోన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అతను కూడా తనకు తాను బ్లేడుతో చేతిపై కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినందున, ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రేమ పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలన్నారు. మహిళలకు ప్రేమించే హక్కు ఉన్నట్లే నచ్చకపోతే నిరాకరించే హక్కు కూడా ఉంటుందని ఆమె చెప్పారు. మహిళల మనోభావాలను అర్ధం చేసుకోవడంలోనే సమాజ గౌరవం ఆధారపడి ఉంటుందన్నారు. ఉన్మాదుల నుంచి మహిళలకు సమస్యలు ఎదురైతే పోలీసు స్టేషన్లు లేదంటే ‘దిశ’ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కర్రి జయశ్రీరెడ్డి సూచించారు. బాధితుల పరామర్శలో ఆమె వెంట రాజనగరం సీడీపీవో నాగమణి, స్థానిక ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.