తిరుమల : ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా జనవరి 1న, ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠద్వార ప్రదక్షిణ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ శనివారం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీచేయగా 40 నిమిషాల్లో మొత్తం బుక్ అయ్యాయి. రూ.300ల టికెట్లను టీటీడీ వెబ్సైట్ ద్వారా ఉదయం 9గంటలకు ఆన్లైన్లో విడుదల చేశారు. రోజుకు 20 వేల చొప్పున 11 రోజులకు 2.20 లక్షల టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు.
26న సిఫార్సు లేఖల నిరాకరణ : శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా 27న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. 27న ఉదయం 6 నుంచి 12 గంటల వరకు ఆలయ శుద్ధి చేయనున్నారు. ఈ కారణంగా 26న సిఫార్సు లేఖలు స్వీకరించమని తెలిపింది. తిరుమలేశుడి దర్శనానికి వారాంతపు రద్దీ కొనసాగుతోంది. ఎలాంటి టోకెన్లు లేకుండా ధర్మదర్శనానికి వచ్చిన భక్తులకు శనివారం 24 గంటల సమయం పట్టింది.