కాసులకు కక్కుర్తి పడి విచ్చలవిడిగా జిల్లా విద్యాశాఖ పర్మిషన్లు
రామన్ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన
అనంతపురం నగరంలోని సాయి నగర్ లో గల రామన్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న
ముద్దలాపురం గ్రామానికి చెందిన హరికృష్ణ అనే అబ్బాయి బుధవారం తన ఇంట్లో
ఉరివేసుకొని చనిపోయాడు. స్కూల్ ప్రిన్సిపాల్, ట్యూటర్ కొట్టడం వల్లనే అతను
ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. రామన్ స్కూల్లో అగ్గిపెట్టె లాంటి
గదుల్లో వందలాదిమంది విద్యార్థులను కూర్చోబెట్టి విద్యను బోధిస్తున్నారు.
కాసులకు కక్కుర్తి పడి విద్యాశాఖ అధికారులు జిల్లాలో విచ్చలవిడిగా
విద్యాసంస్థలకు పర్మిషన్లు ఇస్తున్నారనే విమర్శలున్నాయి. విద్యార్థిని కొట్టే
అధికారం ప్రిన్సిపాల్ కు, ట్యూటర్ కు ఎవరిచ్చారని విద్యార్థి సంఘాల నాయకులు
ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి చావుకు కారణమైన రామన్ స్కూల్ ను సీజ్ చేయాలని
వారు డిమాండ్ చేశారు.. పిల్లవాడు స్కూల్లో అల్లరి చేస్తే తల్లిదండ్రులకు
చెప్పాల్సిన స్కూల్ యాజమాన్యం విద్యార్థిని గాయపడేలా ఇష్టానుసారం కొట్టాల్సిన
పని ఏముందని ప్రశ్నించారు.. జిల్లాలో చాలా స్కూళ్లు పర్మిషన్ లేకుండా ఇరుకైన
గదుల్లో నడుపుతున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి
జిల్లాలో పర్మిషన్ లేని స్కూళ్లను సీజ్ చేయకపోతే ఆందోళనకు శ్రీకారం చుడతామని
హెచ్చరించారు. విద్యార్థి చావుకు కారణమైన రామన్ స్కూల్ యాజమాన్యాన్ని అరెస్టు
చేసి బాధిత తల్లిదండ్రులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు
రామన్ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుల్లాయి స్వామి, చిరంజీవి, ఎస్ఎఫ్ఐ
జిల్లా కార్యదర్శి పరమేష్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య
రాష్ట్ర కార్యదర్శి సురేష్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి లోకేష్, తెలుగు
యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి బాల, హరికృష్ణ, జనసేన నాయకులు సిద్దు, అనంత
హక్కుల వేదిక నాయకులు రాహుల్, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి రమణయ్య, ఆర్గనైజింగ్
కార్యదర్శి ఉమా మహేష్ తదితరులు పాల్గొన్నారు.