జనసేన అధినేత పవన్ కల్యాణ్
అమరావతి : విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దని జనసేన
అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ
ముఖ్యమంత్రి ఫ్లెక్సీలతో యూనివర్సిటీని నింపేయడం ఏం సూచిస్తోందని
ప్రశ్నించారు. విశ్వ విద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక
విషయాలపై చైతన్యవంతులను చేయాలి. కానీ ఆంధ్ర ప్రదేశ్లోని ప్రఖ్యాత విశ్వ
విద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి అధికార పార్టీ కార్యకర్తలను తయారుచేసే
పనిలో ఉన్నాయా అనే సందేహం కలుగుతోందన్నారు. ఫ్లెక్సీల వల్ల పర్యావరణానికి
ఎనలేని హాని కలుగుతుందని సందేశం ఇచ్చిన సీఎం జగన్ కు శుభాకాంక్షలు
చెప్పడానికి ఫ్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉందని పవన్ అన్నారు. ఆ విద్యా వనం
నుంచి ఎందరో మేధావులు వచ్చారని, అలాంటి చోట చిల్లర రాజకీయాలు చేస్తూ, పార్టీ
ఫ్లెక్సీలు కట్టించేవాళ్ళు కీలక బాధ్యతల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో అందరూ
ఆలోచించాలన్నారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోనూ ఇదే పోకడ
కనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రిపై అనురాగం ఉంటే వాటిని ఇంటికే పరిమితం
చేసుకోవాలని సూచించారు. యూనివర్శిటీల ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం
మళ్లించుకోవడాన్ని నిలువరించి, విశ్వ విద్యాలయ అభివృద్ధి కోసం ఉప కులపతులు
బాధ్యతగా పని చేయాలని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.