రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి కారణంగా నొప్పి, వాపు, కదలిక పరిమితులను అనుభవించడం సాధారణ విషయం. రుమాటిక్ ను కీళ్ల వాతం అని పరిగణిస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది క్రానిక్ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. అంటే జీవక్రియల అసమతుల్యత తో మన వ్యాధినిరోధకశక్తే మనపట్ల ప్రతికూలంగా పనిచేయడం వల్ల ఇది వస్తుంది. మన శరీరంలోని వివిధరకాల కణజాలాలు, అవయవాలు, కీళ్లు (సైనోవియల్ జాయింట్స్), ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, హృదయం, రక్తనాళాలు, చర్మంపై ఈ వ్యాధి తాలూకు దుష్ర్పభావం ఉంటుంది.
చిన్నపిల్లల్లోనూ వచ్చే అవకాశం :
రుమాటిక్ ఆర్థరైటిస్ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరిలోనైనా కనిపించే అవకాశం ఉంది. యుక్తవయసులో ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. మగవారిలో కంటే ఆడవారిలో ఇదివచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. వంశపారంపర్యంగానూ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. అయితే చిన్నపిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని జువినైల్ ఆర్థరైటిస్ అని అంటారు.
లక్షణాలు ఇలా :
* వ్యాధిప్రభావం మన కణజాలంతో పాటు అవయవాలపై కూడా ఉన్నప్పటికీ ప్రధానంగా కీళ్లు (సైనోవియల్ జాయింట్స్)పై వ్యాధి మరింతగా ప్రభావం ఉంటుంది.
* కీళ్లలో ఉండే సైనోవియల్ మెంబ్రేన్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్కు గురికావడం వల్ల కీళ్ల వాపు, నొప్పి, వేడిగా అనిపించడం వుంటుంది.
* కీళ్లపై చర్మం లోపల చిన్న చిన్న కణుతులు వస్తాయి.
* జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, రక్తహీనత ఉంటుంది.
* కీళ్ల ప్రాంతంలో చర్మం కింద ఫైబ్రస్ కణజాలం పెరగడంతో అది బయటకు చిన్న కణుతుల్లా కనిపిస్తాయి.