సీజన్ మారినపుడు మీరు పాటించే పద్ధతులు కూడా మారాలి. ఈ నేపథ్యంలో వానాకాలంలో
అందాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
జుట్టు ఆరిన తర్వాత:
ప్రస్తుతం బిజీబిజీ జీవితంలో చాలామంది తలస్నానం చేసి వెంటనే రెడీ అయి బయటకు
వెళుతున్నారు. అయితే వానాకాలంలో బయట తేమ ఎక్కువగా ఉంటుంది. కుదుళ్ల వద్ద ఉన్న
తడికి గాల్లోని తేమ కలిసి జుట్టు అట్టకట్టినట్లు మారిపోతుంది. అందుకే తలస్నానం
చేశాక టవల్ తో కురులను తుడుచుకుని పూర్తిగా ఆరిన తర్వాత బయటకు రావాలి.
మాయిశ్చరైజర్:
వానాకాలంలోనూ చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవడం చాలా అవసరం. లేదంటే చెమట
కారణంగా డీహైడ్రేషన్ కు గురై చర్మం మరింత పొడిబారిపోతుంది. దీనివల్ల ఎగ్జిమా
వంటి చర్మ సమస్యలు వస్తాయి.
క్లే ఫేస్ ప్యాక్స్:
వానాకాలంలో క్లే ఫేస్ మాస్క్, మడ్ ప్యాక్స్ వంటిని చర్మ సౌందర్యానికి బాగా
ఉపయోగపడతాయి. ఇవి చర్మం పొరల్లోని మృతకణాలు, దుమ్ము, ధూళితో పాటు చర్మ రంధ్రాల
వద్ద ఉన్న అధిక నూనెలను తొలగిస్తాయి. ఫలితంగా చర్మం లోపలి నుంచి శుభ్రపడి
కాంతివంతంగా మారుతుంది. వారానికి రెండు, మూడుసార్లు ఇలా చేస్తే మంచిది.
వాటర్ ఫుడ్:
వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నపుడు అందంగా మెరవడం కోసం చర్మానికి బయటి నుంచి
పోషణ అందిస్తేనే సరిపోదు. తగినన్ని నీళ్లు తాగడంతో పాటు నీటి శాతం ఎక్కువగా
ఉన్న పండ్లు తీసుకోవాలి. దీనివల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది.
క్లెన్సింగ్, టోనింగ్:
వానాకాలంలో కచ్చితంగా రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవడం ఉత్తమం. అలాగే
ప్రతిరోజూ క్లెన్సింగ్, టోనింగ్ ప్రక్రియ చేసుకోవాలి. దీనివల్ల తేమ వాతావరణంలో
చర్మాన్ని కాపాడుకోవచ్చు.
సన్ స్క్రీన్:
వానాకాలంలో ఎండ లేదు కదా అని సన్ స్క్రీన్ రాసుకోవడం మానేయవద్దు. బయటకు వెళ్లే
ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం తప్పనిసరి. ఇది మీ చర్మాన్ని యూవీ కిరణాల
నుంచి కాపాడుతుంది.
పౌడర్:
వాతావరణంలో తేమ వల్ల చెమట ఎక్కువగా పడుతుంటుంది. దీనిని తగ్గించేందుకు ఫేస్
వాష్ చేసుకున్న తర్వాత పౌడర్ అప్లై చేసుకోవాలి. ఇది తిరిగి చెమట పట్టకుండా
కాసేపటి వరకు నియంత్రిస్తుంది.
దుస్తులు:
వానాకాలంలో ధరించే దుస్తులపైనా శ్రద్ధ పెట్టడం మంచిది. ఎండాకాలం పూర్తైంది కదా
అని కాటన్ దుస్తులు పక్కన పెట్టేసి సిల్క్ డ్రెస్ ధరించకండి. గాల్లో తేమ
అధికంగా ఉండే కొద్దిరోజుల పాటు చెమట పీల్చే కాటన్ ఫ్యాబ్రిక్ లాంటి దుస్తులే
వేసుకోవడమే మంచిది.