ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదల బతుకుల్లో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ వెలుగులు నింపనుంది. ఆ దిశగా వైసీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రజల ముంగిటకే వైద్య సేవలు తీసుకెళ్ళి వారి ఆరోగ్య రక్షణే ధ్యేయంగా పని చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
ప్రపంచంలో ఒక్క ఇంగ్లండ్ దేశంలో తప్ప ఎక్కడ ఇలాంటి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ లేదు. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందుబాటులో లేక, నాటు వైద్యాలకు, మూఢనమ్మకాలకు బలైపోతున్న కుటుంబాలు ఎన్నో? స్వాతంత్రానంతరం వైద్యరంగంపై పాలకులు తగినంత దృష్టి పెట్టకపోవడం వల్ల, వైద్యం అత్యంత ఖరీదైన వస్తువుగా మారిపోయింది. పేదలు తమ ఆదాయంలో సగానికి పైగా మొత్తం వైధ్యానికే ఖర్చు పెడుతున్నారు. దీంతో ప్రైవేటు రంగంలో వైద్యం విస్తరించింది. ఫలితంగా పేదలకు వైద్యం మరింత దూరమైంది. భారమైంది. తద్వారా అకాల మరణాలు సంభవిస్తూ, చావు బతుకుల మధ్య పేద ప్రజలు చిక్కుకున్నారు. తమ కళ్లముందే తల్లిదండ్రులను, కన్న పిల్లలను పోగొట్టుకుంటున్నారు.
వైద్య ఖర్చులకు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ స్థితి నుంచి పేదలను మెరుగైన స్థితికి తీసుకురావడం కోసం, వైద్యం కారు చౌకగా అందుబాటులోకి రావాలని, ఉచిత వైద్యం ప్రతి పౌరుడి హక్కు అని, వైద్యాన్ని అందించడం ప్రభుత్వాల బాధ్యత అని, తన సుదీర్ఘ పాదయాత్రలో కల్లారా చూసిన ప్రజల డాక్టర్, మనసున్న మారాజు, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి .. వైద్యం అందక పరితపిస్తున్న వారి పరిస్థితికి చలించిపోయి, తాను ముఖ్యమంత్రి అయిన మరుసటిరోజే, ఆరోగ్యశ్రీ పథకానికి, శ్రీకారం చుట్టారు. అంతవరకు పాలించిన ఏ ఒక్కరికీ ఇలాంటి ఆలోచన రాలేదు. అది దేశానికే ఆదర్శమైంది.
ఆ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించి, దాన్ని కేవలం వైఎస్సార్ పథకం గా చూశారేగాని, అది ప్రజల జీవన్మరణ సమస్య అనే విషయం మర్చిపోయి, దానిపై నీళ్లు చల్లారు.. పూర్తిగా ఎత్తివేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందనే భయంతో నామమాత్రంగా అమలు చేసి, ఒక సంవత్సరం పాటు నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన 680 కోట్లు బకాయి పెట్టి చరిత్రహీనుడిగా మిగిలిపోయారు.. వైద్య రంగాన్ని తన ప్రభుత్వ కాలంలో మరింత భ్రష్టు పట్టించారు.. దాని ఫలితాన్ని కరోనా సమయంలో ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించారు.
ఆ తరువాత జగన్ తన సుదూర పాదయాత్ర సందర్భంగా గ్రామీణ పేదల బ్రతుకు చిత్రాన్ని దగ్గరగా చూసి, వైద్యం ఎంత ముఖ్యమో, తన తండ్రి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకం ఆవశ్యకత ఎంత ఉన్నదో, తెలుసుకున్నారు.. వైద్యం అందక, పిల్లలు, తల్లులు, ముసలివారు ఆకస్మికంగా చనిపోతున్నది దగ్గరగా చూశారు..తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య రంగ ప్రక్షాళనకు పూనుకున్నారు.. వైద్య రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చారు.. మొదటగా గ్రామీణ ప్రాంతాలలో వైద్య రంగ ప్రక్షాళన చేయాలని, అందుబాటులో ఉండి, బూజుబట్టిన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దుమ్ము దులిపి, ఆధునికరించారు.. సర్వ సదుపాయాలు కల్పించారు.
అన్ని రకాల మందులను, కావాల్సిన సిబ్బందిని నియమించారు.. అంతటితో ఆగక ధనవంతులతో సమానంగా, పేదవాడుకూడా కూడా తలెత్తుకు తిరిగే విధంగా ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చారు.. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించి, ఆ 50 ఇళ్లలో వస్తున్న వ్యాధులను ఎప్పటికప్పుడు కనిపెట్టే విధంగా సర్వే చేయిస్తున్నారు.. మూడు సంవత్సరాల తన పరిపాలన కాలంలోనే, ఒకవైపు అతి భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే, సంవత్సర ఆదాయం 5 లక్షల వరకు గల, అంటే నాలుగవ తరగతి , కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం వర్తించేటట్టుగా మొత్తం 1,40, 24,000 కుటుంబాలకు దాదాపు 18 వేల కోట్లు చెల్లించడమే కాకుండా చంద్రబాబు ప్రభుత్వం బకాయి పడిన 680 కోట్లు కూడా చెల్లించడం జరిగింది. ఇది మొత్తం రాష్ట్ర జనాభాలో 95శాతం. 47 వేల మందికి కొత్తగా ఉద్యోగ కల్పన జరిగింది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరిగింది. తద్వారా 953 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అంటే పేదల కష్టాన్ని గుర్తించి చరిత్రలో నిలిచిపోయిన కృష్ణదేవరాయలు, అలెగ్జాండర్ల జతన జగన్ నిలిచిపోయారని అనడంలో అతిశయోక్తి లేదు.
తన మూడు సంవత్సరాల పాలనలోనే ప్రపంచాన్ని కబళించిన కరోనా మహమ్మారి నుంచి మన రాష్ట్రాన్ని అతి తక్కువ మరణాలకు పరిమితం చేసిన ఘనత జగన్ కే దక్కుతుంది. ఇది ఎవరైనా అంగీకరించాల్సిందే. అంతే కాకుండా, అన్ని రకాల వ్యాధులను ఎక్కడికక్కడ పరిశోధించి, నిర్ధారించే లేబరేటరీలను తగినన్ని ఏర్పాటు చేశారు. కావాల్సినన్ని ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి శహభాష్ అనిపించుకున్నారు. జన హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు.. అందుకే జగన్ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. దీనితో పాటు వైద్యం తమ సొంత ఖర్చులతో చేసుకున్న వారికి లక్షలాది రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్, పెద్దపెద్ద రోగాలకు కార్పొరేట్ వైద్యశాలల్లో, ఇతర రాష్ట్రాలలో కూడా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా అనారోగ్య కాలంలో వ్యాధి తీవ్రతను బట్టి పని చేయలేనంత కాలం ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు నెలనెలా పెన్షన్ ఇవ్వడం ఎక్కడైనా చూశామా? ఇది ప్రపంచానికే ఆదర్శం కాదా? అందుకే దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని స్వయంగా అధ్యయనం చేస్తున్నారు. వారి వారి రాష్ట్రాలలో అమలుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారంటే జగన్ ముందుచూపు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు..