విజయవాడ : మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసి దాని కోసం కమిషన్ వేశారని ఆ కమిషన్ రిపోర్టు ప్రకారం రైతుల, ఆదాయం పెరగకపోగా ఆదాయం తగ్గిందని,భారాలు మరింత పెరిగాయని దీనికి మోడీ సిగ్గుపడాలని ప్రముఖ జర్నలిస్టు రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు వచ్చి 18 సంవత్సరాలు అయిందని, దేనిని అమలు జరపకపోగా దానిని బిజెపి కేంద్ర ప్రభుత్వం భూస్థాపితం చేసిందని అన్నారు.
ఒకవైపు దేశంలో అదాని,అంబానీల సంపద పెరుగుతుంటే రైతులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని మాకినేని విజ్ఞాన కేంద్రంలో “వ్యవసాయ సంక్షోభం పరిష్కార మార్గాలు “అంశంపై సెమినార్ జరిగింది. ఈ సెమినార్ ముఖ్య అతిథిగా సాయినాథ్ హాజరై మాట్లాడుతూ కరోనా కాలంలో పేదలు ఆకలితో అలమటిస్తుంటే కేంద్ర ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోలేదని పైగా ఆదాని, అంబానీల దోపిడీలకు ఉపయోగపడిందని అన్నారు. కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ప్రపంచంలో కని విని, ఎరుగని రీతిలో రైతులు చారిత్రాత్మకమైన పోరాటం చేసి మోడీ మెడలు వంచి మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్నారని అన్నారు.
రైతుల సమస్యలపై పార్లమెంటులో అసెంబ్లీలో ఒకరోజు పాటు చర్చ జరగాలని రైతాంగం పోరాడుతుంటే పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. భవిష్యత్తులో అదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులు ప్రకారం సి20 ప్లస్ 50% కలిపి మద్దతుల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యల నుండి కాపాడటానికి రుణ ఉపసమనం చట్టం తీసుకురావాలని కోరారు. గ్రామస్థాయి నుండి కేంద్ర స్థాయి వరకు రైతులు ఐక్యంగా ఉద్యమించి వ్యవసాయాన్ని రక్షించుకోవాలని, రైతులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష మంది పైగా రైతాంగం ఆత్మహత్య చేసుకుంటే ఒక్క పర్యాయం రైతుల అప్పులను మాఫీ చేయమని అడుగుతుంటే ఆర్థిక సంక్షోభం వస్తుందని రైతుల రుణమాఫీ చేయలేమని మోడీ గారు పేర్కొనటం దుర్మార్గమని అన్నారు. మరోవైపు బడా పారిశ్రామిక వేత్తలకు 11 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి వారికి ఊడిగిం చేస్తుందన్నారు.
రైతులు ఆదాయం పెరగాలంటే సాగు ఖర్చులు తగ్గించాలని, రైతుల రుణమాఫీ చేయాలని, సాగు చేస్తున్న ప్రతి రైతుకు వడ్డీ లేని రుణాలు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వ కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ ఆర్ సి పి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ సంక్షోభం నుండి రైతులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ,కనీసం ధాన్యాన్ని మద్దతు ధరలకు కూడా కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు చేసిన వాటికి డబ్బులు సకాలంలో ఇవ్వడం లేదని ఇది రైతుల ప్రభుత్వం కాదని, వ్యాపారస్తుల, కమిషన్ ఏజెంట్లు ప్రభుత్వం అని అన్నారు.
కౌలురైతులను ఆదుకునేందుకు ఎటువంటి విధానం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదని వి.శ్రీనివాసరావు అన్నారు.
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యల పట్ల దృష్టి సారించాలని,పెంచిన ఇన్ పుట్స్ ధరలు తగ్గించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, సాగునీటి వినియోగదారుల సంఘాల సామాఖ్య రాష్ట్ర అధ్యక్ష్యులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణ రావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర, కౌలు రైతుల సంఘ రాష్ట్ర కార్యదర్శి యం.హరిబాబు,రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి ,మధు,రైతు సంఘం సీనియర్ నాయకులు కేశవరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి పివి ఆంజనేయులు, గుంటూరు జిల్లా రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు జొన్న శివశంకర్, అజయ్ కుమార్ ,పల్నాడుజిల్లా సంఘం కార్యదర్శి ఎ.గోపాలరావు, కృష్ణా జిల్లా రైతు సంఘం కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు , రాష్ట్ర చెరుకు రైతుల సంఘం అధ్యక్షులు గుండపనేని ఉమా వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి యన్.యస్.వి.శర్మ నెల్లూరు జిల్లా రైతు సంఘం కార్యదర్శి ఎం వెంగయ్య, పశ్చిమగోదావరి జిల్లా రైతుసంఘం కార్యదర్శి ఎ హరేరామ్, ఏలూరు జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం శోభన్ తదితరులు పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య అధ్యక్షత వహించగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య స్వాగతం పలికారు.