నల్గొండ : మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ తరహాలో ఉప ఎన్నికపై బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలు మునుగోడు ఎన్నికలను కీలకంగా తీసుకున్న నేపథ్యంలో గెలుపోటములపై బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. అభ్యర్థులను అంచనా వేస్తూ ఏకంగా కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లు, నగదు చేతులు మారుతున్నట్లు సమాచారం. మునుగోడుతో పాటు చౌటుప్పల్, నాంపల్లి, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్లోని పలు ప్రాంతల్లో ఏజెంట్లను నియమించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థిపై ఒక్కో విధంగా బెట్టింగ్లు వేస్తూ, ఆన్లైన్ ట్రాన్సక్షన్ ద్వారా ఈ దందా నిర్వహిస్తున్నారని వినికిడి. అయితే మునుగోడులో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందకున్న పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బెట్టింగ్ రాయుళ్లపై కన్నేసి ఉంచింది. కాగా ఇప్పటికే మునుగోడు ఓటర్లను ప్రలోభా పెట్టడానికి పార్టీ నేతలు భారీ నగదు పంపిణీ, మద్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. మంత్రుల వాహనాలతో సహా అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.