ఈ–ఎపిక్ ఓటర్ కార్డుల్లో క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్ సహా పలు సెక్యూరిటీ ఫీచర్లు
22,350 మంది అర్హులకు పంపిణీ
నల్లగొండ: కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఓటర్ గుర్తింపు కార్డు లను తొలిసారిగా రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికలో యువ ఓటర్లు వినియోగించబోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తరహాలో ఈ కార్డులు ఉండనున్నాయి. ఈ–ఎపిక్ కార్డులుగా పేర్కొనే ఈ కార్డులు ఆరు ప్రధాన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటాయి. క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ (ఆంగ్ల అక్షరాలు, సంఖ్యలు కలిగిన) ఓటరు గుర్తింపు సంఖ్య, ఓటరు ఫోటో, చిరునామా, ఇతర వివరాలు ఈ కార్డులో ఉంటాయి. మునుగోడులో కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు ఈ కార్డులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటిని పోస్టు ద్వారా మునుగోడుకు పంపించినట్టు సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. పాత ఓటర్లు సైతం మీ–సేవా కేంద్రాల్లో డబ్బులు చెల్లించి ఈ డిజిటల్ ఓటరు కార్డులను పొందవచ్చు.
22,350 మంది అర్హులకు పంపిణీ : ఈ కార్డులను సెక్యూర్డ్ పీడీఎఫ్ ఫైల్ రూపంలో ఫోన్లో లేదా వేరే ఎలక్ట్రానిక్ పరికరంలో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవచ్చు. ఈ–ఎపిక్ కార్డు అందుబాటులో లేకున్నా పీడీఎఫ్ ఫైల్ ప్రింట్‌ను పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ కార్డులను టాంపర్ /ఎడిట్ చేయడం సాధ్యం కాదు. ఈ మేరకు పటిష్ట రక్షణ చర్యలను ఎన్నికల సంఘం తీసుకుంది. నకిలీ ఓటరు కార్డుల తయారీ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం అందిన దరఖాస్తులను ఎన్నికల సంఘం పరిశీలించి 22,350 మంది అర్హులని తేల్చింది. వారందరికీ చెన్నైలో ముద్రించిన కార్డులను తపాలా శాఖ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు.