నువ్వు మద్యం తాగుతావా? ఇదేదో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ లో భాగంగా ఉదయించిన ప్రశ్న అనుకుంటున్నారా? కాదు.. మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి అబ్దుల్ సత్తార్ స్వయంగా బీడ్ జిల్లా కలెక్టర్ రాధాబినోద్ శర్మను అడిగిన ప్రశ్న. వివరాల్లోకి వెళదామా?
అక్టోబర్లో కురిసిన అధిక వర్షాల వల్ల జరిగిన పంటల నష్టాన్ని అంచనా వేయడానికి సెంట్రల్ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సత్తార్ పర్యటించారు. అక్టోబర్ 21న బీడ్ జిల్లాలోని గెవ్రాయి తాలూకాలో పంట నష్టాన్ని పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో కలెక్టర్ శర్మ, జిల్లా అధికారులు, మరికొంత మందితో కలిసి హాలులో మంత్రి కూర్చున్న దృశ్యం ఉంది. ఈ సందర్భంగా మంత్రి సత్తార్, ఇతరులకు టీ అందించినప్పుడు, కలెక్టర్ శర్మ టీ తాగడానికి నిరాకరించాడు. ఆ సమయంలో మరి మద్యం తాగుతావా? అని మంత్రి ప్రశ్నించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.