న్యూఢిల్లీ : రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగుతో ఫోన్లో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్ ఉక్రెయిన్, రష్యా పరస్పర దాడులకు అణ్వాయుధాలను ఆశ్రయించొద్దని కోరారు. ఉక్రెయిన్- రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక సూచనలు చేశారు. ఇరు దేశాలూ పరస్పర దాడులకు అణ్వాయుధాలను ఆశ్రయించొద్దన్నారు. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగుతో రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో ఉన్న వివాదాన్ని వీలైనంత త్వరగా చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవాలన్న భారత్ వైఖరిని మరోసారి స్పష్టంచేశారు.
ఇద్దరు నేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సందర్భంగా షొయిగు ఉక్రెయిన్‌లోని పరిస్థితులను రాజ్‌నాథ్‌కు వివరించారని, ఉక్రెయిన్ తమ దేశంపై డర్టీబాంబ్ ప్రయోగించేందుకు కవ్వింపులకు పాల్పడుతోందన్న ఆందోళనను కూడా వ్యక్తంచేశారని కేంద్ర రక్షణశాఖ తెలిపింది. అయితే, రాజ్‌నాథ్ సింగ్ అణు, రేడియోలాజికల్ ఆయుధాల వినియోగం మానవత్వపు ప్రాథమిక సిద్ధాంతానికి విరుద్ధమైనందున వాటిని ఆశ్రయించొద్దని కోరినట్టు పేర్కొంది. అలాగే, భారత్, రష్యా మధ్య సైనిక సహకారంతో పాటు ఉక్రెయిన్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపైనా చర్చించారని తెలిపింది.