టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌పై అసాధారణ విజయం సాధించి.. తదుపరి మ్యాచ్ కోసం సిడ్నీ చేరుకున్న టీమిండియా అక్కడి సర్వీసుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. గురువారం నెదర్లాండ్‌పై మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మంగళవారం ప్రాక్టీస్ చేసింది. ప్రాక్టీస్ అనంతరం మధ్యాహ్న భోజనంగా చద్ది ఆహారం (చల్లబడింది), సాండ్విచ్లు అందించడంపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పలువురు టాప్ ఇండియన్ ఆటగాళ్లు ఆ ఆహారాన్ని తినకుండా నిరసన వ్యక్తం చేశారు. ఆహారం విషయంలోనే కాదు..
మెల్బోర్న్ నుంచి సిడ్నీ చేరుకున్న భారత జట్టుకు సరైన రీతిలో స్వాగతం కూడా పలకలేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
‘‘టీమిండియాకు అందించిన ఆహారం బాలేదు. సాండ్విచ్లు మాత్రమే ఇచ్చారు. సిడ్నీలో ప్రాక్టిస్ సెషన్ తర్వాత అందించిన ఫుడ్ చల్లగా ఉంది. అదేమీ బాలేదు. ఈ విషయాన్ని ఐసీసీకి తెలియజేశాం’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రాక్టిస్ తర్వాత అందించిన ఆహారంలో సాండ్విచ్లు, పండ్లు, ఫలాఫెల్ (స్ట్రీట్ ఫుడ్ లాంటిది) అందించారని, ఈ ఆహారంపై ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేశారని తెలిపాయి. ప్రాక్టిస్ వద్ద లంచ్ చేయకూడదని టాప్ ఆటగాళ్లు నిర్ణయించారని, తమకు నచ్చిన ఆహారం కోసం హోటల్‌కు వెళ్లిపోయారని రిపోర్టులు పేర్కొన్నాయి.
కాగా ఇది బాయ్‌కాట్ చేయడం లాంటిది కాదని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నట్టు సమాచారం. ‘ అందరూ లంచ్ చేయాలనుకున్నారు. కానీ కొందరు ఆటగాళ్లు పండ్లు మాత్రమే తీసుకున్నారు’ అని వెల్లడించారు. అందుకోసమే ఆటగాళ్లు హోటల్‌కు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. కాగా టీ20 వరల్డ్ కప్ 2022లో పాల్గొనే ఆటగాళ్లకు ఆహారం, బస ఏర్పాట్లను ఐసీసీ నిర్వహిస్తోంది. ద్వైపాక్షిక సీరిస్‌లలో ఆతిథ్య దేశాలు భారత ఆటగాళ్లకు వేడి వేడి భారతీయ వంటకాలను సిద్ధం చేసేవని, అయితే ఐసీసీ వేడి ఆహారాన్ని అందించడంలేదని ఒక అధికారి పేర్కొన్నారు.