చౌటుప్పల్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి, మునుగోడు నియోజకవర్గానికి ఏం చేసిందో, ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్‌లో శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. కమలం పువ్వులు ఇంటింటికీ పంచుతూ ఓటు వేయాలని హిందూ, ముస్లిములను కోరుతూ ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఇది మునుగోడుకు సంబంధించిన ఉప ఎన్నిక కాదని, తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక అని తెలిపారు.
అబద్దాలు, దొంగ పత్రాలు సృష్టిస్తూ, డబ్బు, మద్యం, బంగారు బిస్కెట్లు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారం మరింత పెరుగుతుందన్నారు. చేనేతకు జీఎస్టీ విషయంలో నాలుగేళ్ల క్రితం సమావేశంలో పాల్గొన్నదెవరు? అప్పుడు కేటీఆర్ అంగీకరించి, ఇప్పుడు వ్యతిరేకించడంపై ఏం సమాధానం చెబుతారని అడిగారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, శంకర్, శ్రీధర్‌బాబు, ఊడుగు వెంకటేశం, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.