హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరుగుతోందా? ఎల్బీ నగర్‌కు మునుగోడుకు సంబంధం ఏంటి? మునుగోడులో ఎవరు గెలిచేది ఎల్బీ నగర్ నిర్దేశించబోతోందా? మునుగోడు వెళ్లాల్సిన మూడు పార్టీల ముఖ్య నేతలంతా ఎల్బీనగర్లోనే ఎందుకు మకాం వేశారు?. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు చావో రేవో అన్నట్లుగా ప్రయత్నిస్తున్నాయి. ఒక్క ఓటు కూడా పోకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేవు రాజకీయ పార్టీలు. అందుకే మునుగోడు ఓటర్లు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నారో గాలిస్తున్నారు. వెతికి పట్టుకుంటున్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆశలు రేకెత్తిస్తున్నారు. తాయిలాలు ఎరగా వేస్తున్నారు.
నియోజకవర్గానికి చెందిన వేలాది మంది ఓటర్లు ఉపాధి కోసం హైదరాబాద్ నగర శివార్లలోని పలు ప్రాంతాలకు వలస వచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోనే ఉంటూ ప్రయివేటు ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉంటున్నవారి అడ్రస్, ఫోన్ నెంబర్లు మునుగోడులోని వారి బంధు, మిత్రుల నుంచి సేకరించి వారితో భేటీలు నిర్వహిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో మునుగోడు ఓటర్లు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. దాదాపు 25 వేల మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరంతా మునుగోడు ఓటర్లే. దీనిపై పక్కా సమాచారం సేకరించిన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు వలస ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు మందు, విందు ఏర్పాటు చేసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. నాగార్జున సాగర్ రోడ్లో ఇబ్రహీం పట్టణం సహారా ఎస్టేట్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉన్న కాలనీల్లో మూడు పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారని టాక్. ఎవరికి వారు తమ పార్టీకే ఓటేసేవిధంగా వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
మునుగోడు ఓటర్ల కోసం ముంబైలో గాలింపు : పార్టీల ప్రచారం చూస్తున్న స్థానికులు ఎన్నిక జరుగుతోంది. మునుగోడు లోనా ఎల్బీనగర్ లోనా అని చర్చించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి ఒక ఎల్బీనగర్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఉపాధి వెతుక్కుంటూ ముంబాయి వెళ్లినటువంటి వలస కూలీల వద్దకు కూడా ఒక పార్టీ కీలక నేత వెళ్లి నవంబర్ మూడున ఓటు వేసేందుకు రావలసిందిగా కోరినట్లు సమాచారం. అందుకు అవసరమైన ఖర్చు కూడా తామే భరిస్తామని, ఏదైనా కోరితే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చి వచ్చారట. కొంత అడ్వాన్స్ కూడా చెల్లించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.