నవంబర్ లో ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనకు ఏర్పాట్లు * అధికారులతో సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు.
విజయనగరం : వచ్చే నవంబర్ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలకు శంకుస్థాపన చేయించాలనే ఆలోచనతో ప్రభుత్వం వుందని, వీటి ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ, నిర్వాసితుల పునరావాసం త్వరగా పూర్తి చేసి శంకుస్థాపనకు సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.
ఈ రెండు ప్రాజెక్టుల భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో మంత్రి మంగళవారం జిల్లా కలెక్టర్, ఎస్.పి., జే.సి., ఆర్.డి.ఓ.లు, భూసేకరణ ప్రత్యెక డిప్యూటీ కలెక్టర్లు, జి.ఎం.ఆర్. ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్ సి.ఇ.ఓ. మనోమయ్ రాయ్, ప్రాజెక్ట్ హెడ్ రామరాజు తదితరులతో ఈ రెండు ప్రాజెక్టులపై సమీక్షించారు.
జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య, కడుబండి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ముందుగా భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణ అంశంపై న్యాయస్థానాల్లో వున్న కేసులు, వాటిపై ప్రభుత్వ పరంగా చేపట్టిన చర్యల గురించి జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి, జే.సి. మయూర్ అశోక్ ద్వారా తెలుసుకున్నారు. జి.ఎం.ఆర్. సంస్థ ప్రతినిధులతో కుడా ఈ అంశంపై మాట్లాడారు. ఎయిర్ పోర్టు టెర్మినల్ భవనాలు, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూములు ముందుగా జి.ఎం.ఆర్. సంస్థకు ఇచ్చే విషయంపై దృష్టి సారించాలని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆ సంస్థకు ఇచ్చిన కమిట్మెంట్ మేరకు భూములు ముందుగా అందజేయాలని పేర్కొన్నారు.
నిర్వాసిత కాలనీల్లో ఇళ్ళ నిర్మాణం, రోడ్లు, సామాజిక భవనాల నిర్మాణంపై రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసిత కాలనీ ల నిర్మాణంలో నిధుల విడుదల సమస్య ఏర్పడకుండా చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేసారు. ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. నిర్వాసితుల ఇళ్ళ నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. కాలనీల నిర్మాణంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భుసేకరణపై బొబ్బిలి ఆర్.డి.ఓ. శేషశైలజ ప్రస్తుత పరిస్థితిని మంత్రికి వివరించారు.
డి.పట్టా భూములు, జిరాయితీ భూములు, ఎలాంటి పట్టా లేకుండా ఇతరుల స్వాధీనంలో వున్న భూములకు సంబంధించి వచ్చే సమావేశం నాటికి పూర్తి సమాచారంతో రావాలని మంత్రి సూచించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ప్రాంతానికి చెందిన గ్రామ సర్పంచ్ తో మంత్రి మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటవుతున్నందున ఆ ప్రాంత రైతులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు భూసేకరణలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందని ఈ అవకాశం విడిచిపెట్టకుండా ఆలోచించాలని సూచించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థలంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం వెంటనే ప్రతిపాదనలు రుపొందిచాలని ఇ.పి.డి.సి.ఎల్. అధికారులను మంత్రి ఆదేశించారు. జాతీయ రహదారి నుంచి గిరిజన విశ్వవిద్యాలయం వరకు నాలుగు వరసల రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించి అందజేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులని మంత్రి ఆదేశించారు.
చెరకు రైతులకు సరైన ధర చెల్లిస్తేనే చెరకు తరలింపు : మంత్రి స్పష్టీకరణ
చెరకు రైతులకు నష్టం లేకుండా తగిన ధర చెల్లిస్తేనే సంకిలి చక్కర కర్మాగారానికి భీమసింగి, సీతానగరం చక్కెర ఫ్యాక్టరీల పరిధిలో ఈ సీజన్లో పండించే చెరకు తరలించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి సంకిలి పారిస్ కర్మాగారం ప్రతినిధులకు స్పష్టం చేసారు. సంకిలి కర్మాగారం కు ఎప్పటి నుంచి చెరకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంత ధర చేల్లిస్తున్నరనే అంశాలపై మంత్రి చక్కర కర్మాగారం ప్రతినిధులు, షుగర్ కెన్ అధికారులతో సమీక్షించారు.
సీతానగరం పరిధిలో నవంబర్ 15న, భీమసింగి పరిధిలో నవంబర్ 16 నుంచి చెరకు తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. చోడవరం చక్కర కర్మాగారం రూ.2821 చెల్లించి రైతు పొలం వద్ద నుంచే తీసుకు వెళ్లేందుకు సిద్దంగా వున్నారని, ఆ స్థాయిలో ధర చెల్లిస్తేనే సంకిలి ఫ్యాక్టరీ కి ఈ ఏడాది తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ దీపిక, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఎం.వి.సూర్య కళ, అప్పారావు, శేష శైలజ, ప్రత్యెక డిప్యూటీ కలెక్టర్లు సుదర్శన దొర, పద్మలీల, రోడ్లు భవనాల శాఖ ఎస్.ఇ. విజయశ్రీ, పంచాయతీరాజ్ ఎస్.ఇ. గుప్తా, విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్.ఇ. చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.