హైదరాబాద్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ దారుణం రాజధాని నగరంలో కలకలం రేపింది. దీనిపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్కూలు గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ పిల్లల భద్రతపై రాజీ పడవద్దని సూచించారు. తాజాగా ఈ ఘటనపై మెగాస్టార్ చిరు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పసిబిడ్డపై జరిగిన అఘాయిత్యం తనను తీవ్రంగా కలచివేసిందని ఎమోషనల్ అయ్యారు.
దీనికి కారణమైన కఠినాతి కఠినంగా శిక్షించాలని చిరంజీవి ట్వీట్ చేశారు. విద్యాసంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీటర్ వేదికగా కోరారు. మెగాస్టార్ తన ట్వీట్ లో రాస్తూ.. ‘బంజారాహిల్స్ లోని పాఠశాలలో చిన్నారిపై జరిగిన అత్యాచారం, అఘాయిత్యం తనను తీవ్రంగా కలిచివేసింది. నాలుగేళ్ల పసిబిడ్డపై జరిగిన ఘటన చాలా బాధాకరం. ఇలాంటి ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. అంతే కాకుండా అన్ని విద్యాసంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. భావి తరాలకు భరోసా కల్పించడం మనందరి బాధ్యతగా భావిస్తున్నా.’ అంటూ మెగాస్టార్ ఎమోషనలల్ పోస్ట్ చేశారు.’