హైదరాబాద్ : మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోవైపు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఏ క్షణంలో ఏ పొరపాటు జరుగుతుందోనని వణుకుతున్నారు. విధి నిర్వహణలో ఏ చిన్న పొరపాటు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశం ఉండడంతో అధికారుల్లో భయం పెరిగిపోయింది. సరైన అవగాహన లేక ఇద్దరు అధికారులు చేసిన తప్పిదాలపై ఎన్నికల సంఘం తీవ్ర చర్యలు తీసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తనకు లేని అధికారాలను ఉపయోగించి ఓ అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును మార్చి కొత్త గుర్తును కేటాయించినందుకు గాను మునుగోడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్వో) కేవీఎం జగన్నాథరావుపై ఎన్నికల సంఘం వేటు వేసి కొత్త ఆర్వోను నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జగన్నాథరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు.
అలాగే ఓ అభ్యర్థికి సంబంధించిన ఓడ (షిప్) గుర్తుకి బదులు పడవ (బోటు) గుర్తును ముద్రించినందుకు గాను చౌటుప్పల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు విధించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మునుగోడు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులుగా బాధ్యతల స్వీకరణకు సైతం అధికారులు ఆసక్తి చూపడం లేదని పేర్కొంటున్నాయి. ఎన్నికల నిర్వహణ అంటేనే తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని కాగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సాధారణ ఎన్నికలకి మించిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని అధికారులు పేర్కొంటున్నాయి. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సీఈఓ కార్యాలయం అధికారులకు ఫోన్ చేసి సలహాలను అడుగుతున్నారు.