బీజేపీ వైపు 22మంది ఎమ్మెల్యేల చూపు
ముంబయి : షిండే శిబిరంలో మొత్తంగా 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా. వారిలో 22మంది బీజేపీలో చేరబోతున్నారంటూ ఉద్ధవ్ వర్గానికి చెందిన అధికారిక పత్రిక ‘సామ్నా’ పేర్కొంది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే శిబిరంలోని మెజార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, వారంతా త్వరలో బీజేపీ లో చేరబోతున్నారని ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన ఆరోపించింది. శిందే శిబిరంలో మొత్తంగా 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా. వారిలో 22మంది బీజేపీలో చేరబోతున్నారంటూ ఉద్ధవ్ వర్గానికి చెందిన అధికారిక పత్రిక ‘సామ్నా’ పేర్కొంది.
ఏక్నాథ్ షిండేను సీఎంని చేయడం తాత్కాలిక ఏర్పాటులో భాగమేనని, ఆయన ధరించిన సీఎం యూనిఫాంని ఎప్పుడైనా తొలగిస్తారని ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందని రాసుకొచ్చింది. తూర్పు అంధేరి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో షిండేశిబిరం తన అభ్యర్థిని బరిలో దించాల్సిఉండేదని, కాకపోతే భాజపానే నిలువరించిందని ప్రత్యేక వ్యాసంలో పేర్కొంది. మహారాష్ట్రలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినట్టు షిండే చెప్పుకొంటున్నవన్నీ అవాస్తవాలేనంది. షిండే శిబిరంలో కనీసం 22మంది ఎమ్మెల్యేలు ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నారని, వారంతా బీజేపీలో చేరబోతున్నారంటూ ఆరోపించింది. షిండే తనకు తానే కాకుండా రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టంచేశారని ‘సామ్నా’ మండిపడింది. షిండేను రాష్ట్రం క్షమించదని పేర్కొంది. బీజేపీ తన లబ్ది కోసం షిండేను వినియోగించుకుంటూనే ఉంటుందని పేర్కొంది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ తీసుకొంటున్న నిర్ణయాలనే సీఎం ఏక్నాథ్ శిందే ప్రకటిస్తున్నారంటూ ఎద్దేవా చేసింది.