కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి పండుగ వేడుకల్లో పాల్గొన్న మోడీ
న్యూఢిల్లీ : రక్షణ దళాల్లో మహిళలు చేరడం వల్ల భారత దేశం సామర్థ్యం మరింత పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సైనికులే తన కుటుంబమని చెప్పారు. కార్గిల్ సెక్టర్లో పాకిస్థాన్‌తో జరిగిన అన్ని యుద్ధాల్లోనూ భారత్ విజయ పతాకాన్ని ఎగురవేసిందన్నారు. ఆయన కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. సరిహద్దులు సురక్షితంగా, భద్రంగా ఉన్నపుడు, ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నపుడు, సమాజం సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉన్నపుడు మాత్రమే దేశం క్షేమంగా ఉంటుందని చెప్పారు. కార్గిల్‌లో 1999లో జరిగిన యుద్ధంలో మన రక్షణ దళాలు ఉగ్రవాదాన్ని అణచివేశాయని చెప్పారు.
అప్పట్లో ఇక్కడ జరుపుకున్న దీపావళిని ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. తాను ఆ యుద్ధాన్ని నిశితంగా చూశానని చెప్పారు. అప్పట్లో తనను కార్గిల్‌కు తీసుకొచ్చినది తన కర్తవ్యమని తెలిపారు. కార్గిల్‌కు రావడం తన కర్తవ్యమని చెప్పారు. విజయ దుందుభి నాదం సర్వత్రా మారుమోగుతున్న అప్పటి సంగతులు, మధుర జ్ఞాపకాలు అనేకం ఉన్నాయని తెలిపారు. భారత దేశ కీర్తి, ప్రతిష్ఠలు ప్రపంచవ్యాప్తంగా పెరగడానికి కారణం అంతర్గత, బాహ్య శత్రువులను విజయవంతంగా ఎదుర్కొనడమేనని పేర్కొన్నారు.
భారత దేశం బలోపేతమవడం వల్ల ప్రపంచ శాంతి, సౌభాగ్యాలకు బాటలు పడతాయని చెప్పారు. అవినీతిపై దృఢసంకల్పంతో పోరాటం చేస్తున్నామని, అవినీతిపరులు ఎంత బలవంతులైనప్పటకీ వదిలిపెట్టబోమని చెప్పారు. రక్షణ దళాల్లో అనేక దశాబ్దాల నుంచి అవసరమైన సంస్కరణలు నేడు అమలవుతున్నాయన్నారు. దేశ భద్రతకు అత్యంత కీలకమైనది ‘స్వయంసమృద్ధ భారత్’ అని చెప్పారు. విదేశీ ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలపై మనం ఆధారపడటం నామమాత్రం కావాలన్నారు. యుద్ధం చేయడానికి తాము మొదటి ప్రాధాన్యం ఇవ్వబోమని, అది చిట్ట చివరి అంశమని చెప్పారు. శాంతిని తాము విశ్వసిస్తామని, అయితే శక్తి, సామర్థ్యాలు, సత్తా లేకుండా శాంతి సాధ్యం కాదని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ 2014లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.