సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు విమర్శలు, ప్రతికూల అంశాలు ఎదురవడం సహజమే. అయితే అవి శృతి మించితే మాత్రం ఎంతటి వారైనా సరే ఇబ్బందులు పడక తప్పదు. తాజాగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా అదేవిధంగా బాధపడుతోంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, దీని వల్ల తనే కాకుండా సన్నిహితులు కూడా బాధపడుతున్నారని ఆమె వాపోయింది. ఈ క్రమంలో ఆమె ఒక భావోద్వేగపూరిత పోస్ట్ చేసింది. ‘నేను నటిగా అరంగేట్రం చేసినప్పటి నుంచీ నాపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. సద్విమర్శలు మనం ఎదిగేందుకు దోహదపడతాయని భావిస్తాను. వాటిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తా. మనం అందరికీ నచ్చాలని అనుకోవడం తప్పు. అయితే అందరికీ నచ్చేలా పనిచేయాలి, కష్టపడాలని ప్రయత్నిస్తుంటా. చాలాకాలంగా సోషల్ మీడియాలో నాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పోనీలే అని వదిలేశా. నాపై ఎందుకింత ద్వేషం? ట్రోల్స్‌తో పంచింగ్ బ్యాగ్‌లా ఆడుకున్నారు. కానీ గతంలోనే దీనిపై మాట్లాడకుండా తప్పు చేశాననిపిస్తున్నది. నా వీడియో ఇంటర్వ్యూలనూ వక్రీకరిస్తున్నారు. నేను అనని మాటలు ఆపాదిస్తున్నారు. వీటి వల్ల నాతో పాటు నా మిత్రులకూ ఇబ్బంది కలుగుతున్నది. నాకెవరి మీదా ద్వేషం లేదు. అందర్నీ ప్రేమిస్తాను. వారి అభిమానం మరింత పొందేలా మంచి చిత్రాల్లో నటిస్తాను’ అని చెప్పింది. ఇది మంచి పద్ధతి కాదంటూ కూడా ఆమె స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.