‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు
భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన
‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్ర సంగీత దర్శకులు శ్రీ ఎం.ఎం.కీరవాణి గారికి, గీత రచయిత
శ్రీ చంద్రబోస్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ వార్తను చూడగానే ఎంతో
సంతోషించాను. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన ‘ఆర్.ఆర్.ఆర్.’
చిత్రంలో ‘నాటు నాటు…’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో
పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద
రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని
ప్రదర్శించడంతోపాటు… అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో
స్థాయికి చేరింది.
ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు శ్రీ
ఎస్.ఎస్.రాజమౌళి గారికి ప్రత్యేక అభినందనలు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో
ఒదిగిపోయిన శ్రీ ఎన్.టి.ఆర్., శ్రీ రాంచరణ్, గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్,
శ్రీ కాలభైరవ, నృత్య దర్శకులు శ్రీ ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత శ్రీ
డి.వి.వి.దానయ్యలకు అభినందనలు. ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రానికి దక్కిన ప్రఖ్యాత
ఆస్కార్ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు,
రచయితలకు స్ఫూర్తినిస్తుంది.
(పవన్ కళ్యాణ్)