ఒకప్పుడు ఇదే రాహుల్ తన పేరు కనీసం 10 మందికైనా తెలియాలని ఎంత తపనపడ్డారో..?ధూల్ పేట్లో పుట్టి పెరిగి.. ఆ తర్వాత విజయ్ నగర్ కాలనీలోని కోటమ్మ బస్తీకి
మారి.. ఇప్పుడు బంజారా హిల్స్‌లో సెటిల్ అయ్యారు రాహుల్. పక్కా మిడిల్ క్లాస్
మెంటాలిటీతో పెరిగిన ఈ కుర్రాడు.. తన పాటల్లోనూ అదే చూపించాడు. హైదరాబాద్‌లోని
ఓ చిన్న బస్తీలో ఉండే రాహుల్ సిప్లిగంజ్ కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చింది బిగ్
బాస్ రియాలిటీ షో. అప్పటి వరకు ఆయన పాటలు పాడుతున్నా.. ఇండస్ట్రీలో గుర్తింపు
తెచ్చుకున్నా.. రాహుల్ సిప్లిగంజ్ అనే వ్యక్తి జీవితం మలుపు తిరిగింది మాత్రం
రియాలిటీ షోతోనే. అక్కడ్నుంచే ఈ సింగర్ లైఫ్ స్టైల్ మారిపోయింది. 2009లో నాగ
చైతన్య హీరోగా వచ్చిన జోష్ తోనే రాహుల్ సిప్లిగంజ్ జర్నీ కూడా మొదలైంది.
అందులో కాలేజ్ బుల్లోడా అనే పాటతో పరిచయం అయ్యారు రాహుల్. 20 ఏళ్ళ వయసులో
సింగర్ అయిన రాహుల్.. గుర్తింపు కోసం మాత్రం చాలా ఏళ్ళ పాటు చూసారు. దమ్ములో
టైటిల్ సాంగ్ పాడినా.. రచ్చలో సింగరేణి ఉంది అంటూ మాస్ సాంగ్ పాడినా.. రాహుల్
దశ మార్చింది మాత్రం బిగ్ బాస్ రియాలిటీ షో.
ఇప్పుడు ప్రపంచమంతా ఈయన గురించి మాట్లాడుకుంటుంది. ఆస్కార్ స్టేజ్‌పై లైవ్
పర్ఫార్మెన్స్ అంటే మాటలు కాదు.. కనీసం కలలో కూడా ఊహించని విషయం అది.. ఇంతకంటే
పెద్ద విజయం రాహుల్ లైఫ్‌లో ఉండకపోవచ్చు. ప్రపంచం చూస్తుండగా.. నాటు నాటు
పాటతో రచ్చ చేశారు ఈ ధూల్ పేట్ కుర్రాడు. నాటు నాటు పాట విడుదలైనపుడు రాహుల్
సిప్లిగంజ్ కూడా అనుకుని ఉండరు ఈ పాట ఆస్కార్ అంత దూరం వెళ్తుందని..!
కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మారు కానీ ఆస్కార్ వరకు వెళ్లే అవకాశం వస్తుందని
మాత్రం ఊహించలేదని ఆయనే చెప్పారు. అంత దూరం మన పాటను తీసుకెళ్ళిన కీరవాణి,
రాజమౌళికి మనస్పూర్థిగా థ్యాంక్స్ చెప్పారు రాహుల్. ఆ పాట కారణంగానే ఈ రోజు
అమెరికాలో హాట్ ఫేవరేట్ అయ్యారు ఈ బస్తీ పోరడు.