టాలీవుడ్ నటుడు మంచు మనోజ్-భూమా మౌనిక వివాహం గత రాత్రి ఘనంగా జరిగింది.
హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో గత రాత్రి 8.30 గంటల సమయంలో
మౌనిక మెడలో మనోజ్ మూడుముళ్లు వేశాడు. ఈ వేడుకకు దగ్గరి బంధువులు, ఇరు కుటుంబ
సభ్యులు హాజరయ్యారు. టీజీ వెంకటేశ్, కోదంరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ,
నిక్కీ గల్రానీ, దేవినేని అవినాశ్ తదితరులు హాజరై నూతన వధూవరులను
ఆశీర్వదించారు.
మనోజ్‌కు 2015లో ప్రణతిరెడ్డితో వివాహమైంది. అయితే, ఆ తర్వాత మనస్పర్థలు
కారణంగా 2019లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇక, దివంగత భూమా
నాగిరెడ్డి-శోభానాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికా రెడ్డికి గతంలో బెంగళూరుకు
చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహం జరిగింది. వీరికి కూడా ఆ తర్వాత విడాకులయ్యాయి.
గతేడాది వినాయకచవితి సందర్భంగా మనోజ్-మౌనిక ఇద్దరూ హైదరాబాద్‌లోని ఓ మండపం
వద్ద ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ పెళ్లి
చేసుకోబోతున్నారంటూ ఒకటే వార్తలు. వీరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా
కోడై కూసినప్పటికీ ఇప్పటి వరకు వీరిద్దరూ అధికారికంగా స్పందించలేదు. నిన్న
ఉదయం మాత్రం ‘పెళ్లి కూతురు’ అంటూ మౌనిక ఫొటోను మనోజ్ షేర్ చేశారు.