ఆ బాధ్యత దర్శకులదే..
ఉత్తరప్రదేశ్ సినీ నిర్మాణం కోసం ఓ పాలసీని రూపొందించాం
పఠాన్ మూవీపై స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ విషయంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ
చిత్రంలోని బేషరం రంగ్ పాటలోని కాస్ట్యూమ్స్ విషయంలో హిందూ సంస్థల నుంచి
అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ‘బాయ్‌కాట్ పఠాన్’ అంటూ సోషల్ మీడియాలో
ట్రెండ్ చేశారు.
తాజాగా ఈ వివాదంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
స్పందించారు. ఈ అంశంపై ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ‘‘ఒక సినిమా
రూపొందించేటప్పుడు ఆ సినిమా దర్శకుడు వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకూడదు.
సినిమాలో ప్రజల మనోభావాలు దెబ్బతినే అంశాలు లేకుండా చూసుకోవాలి’’ అని
వ్యాఖ్యానించారు. కళాకారులను గౌరవించే విషయానికి తమ ప్రభుత్వం కట్టుబడి
ఉందన్నారు. ‘‘ఏ కళాకారుడినైనా, సాహితీవేత్తనైనా, వారు చేసే పనినిబట్టి
గౌరవిస్తాం. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సినిమాలు, సినిమాల నిర్మాణం కోసం ఒక
ప్రత్యేక పాలసీని రూపొందించింది’’ అని ఆయన గుర్తు చేశారు.
బేషరమ్ రంగ్ పాట విడుదలైన తర్వాత పఠాన్ వివాదంలో చిక్కుకుంది. ఈ పాటలో
దీపిక కుంకుమ పువ్వు రంగు గల బికినీ ధరించడం వివాదానికి కారణమైంది. సోషల్
మీడియాలో బహిష్కరణ ధోరణితో పాటు దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి అనేక నిరసనలకు
ఇది దారితీసిన విషయం తెలిసిందే.