యువ నటి తునీషా శర్మ మృతి కేసులో ఆమె సహ నటుడు షీజాన్ ఖాన్‌ను పోలీసులు ఇవాళ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ముంబైలోని వాసాయ్ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అతనికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఓ టీవీ సీరియల్ షూటింగ్ సెట్లో తునీషా శర్మ రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. షూటింగ్ గ్యాప్‌లో టాయిలెట్స్‌కు అని వెళ్లిన ఆమె ఎంతకూ బయటికి రాకపోవడంతో సీరియల్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా.. తునీషా మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. అమె ఆత్మహత్య కేసులో సహ నటుడు షీజన్ ఖాన్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేయడంతో కొత్త మలుపు తిరిగింది. షీజన్ మహ్మద్ ఖాన్‌ను సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద అరెస్టు చేశారు.
తునీషా, ఆమె సహనటుడు షీజాన్ ఖాన్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని తేలింది. 15 రోజుల క్రితమే షీజాన్ ఖాన్ ఆమెకు బ్రేకప్ చెప్పినట్లు తెలిసింది. అప్పటి నుంచి తునీషా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైందని, దాంతోనే చివరికి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. తునీషా ఆత్మహత్య చేసుకునేలా షీజాన్ ఖాన్ ప్రేరేపించినట్లుగా అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపర్చి కస్టడీ కోరారు. కోర్టు నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించడంతో షీజాన్ ఖాన్‌ను ఇంటరాగేట్ చేస్తున్నారు.