హైదరాబాద్: టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు(78) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితమే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతిచెందగా.. ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఉన్నారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన కుమారుడు రవిబాబు ఇంట్లో చలపతిరావు ఉంటున్నారు.
1944 మే8న కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో జన్మించిన చలపతిరావు.. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. నటుడు, నిర్మాతగా గుర్తింపు పొందారు. 1500కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ‘కథానాయకుడు’ సినిమాతో ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్, కృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్ చిత్రాల్లో ఆయన సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ‘కలియుగ కృష్ణుడు’, ’కడప రెడ్డమ్మ’, ‘జగన్నాటకం’, ‘పెళ్లంటే నూరేళ్ల పంట’తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు. సీనియర్ ఎన్టీఆర్తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. మూడు తరాల నటులతోనూ ఆయన నటించారు. ‘యమగోల’, ‘యుగపురుషుడు’, ‘డ్రైవర్ రాముడు’, ‘అక్బర్ సలీమ్ అనార్కలి’, ‘భలే కృష్ణుడు’, ‘సరదా రాముడు’, ‘జస్టిస్ చౌదరి’, ‘బొబ్బిలి పులి’, ‘చట్టంతో పోరాటం’, ‘దొంగ రాముడు’, ‘అల్లరి అల్లుడు’, ‘అల్లరి’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘నువ్వే కావాలి’, ‘సింహాద్రి’, ‘బన్నీ’, ‘బొమ్మరిల్లు’, ‘అరుంధతి’, ‘సింహా’, ‘దమ్ము’, ‘లెజెండ్’ ఇలా ఎన్నో వందల చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ‘బంగార్రాజు’ తర్వాత చలపతిరావు వెండితెరపై కనిపించలేదు.
బుధవారం అంత్యక్రియలు : కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత చలపతిరావు అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానం ఫ్రీజర్లో ఉంచి బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.