హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పట్ట పగలు దొంగలు దొరికిపోవడంతో బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.‘‘మారు వేషాల్లో వచ్చిన స్వామీజీలు, మఠాధిపతులు తమకు తెలియదని బీజేపీ నేతలు బుకాయించారు. ప్రభుత్వం వారిని అరెస్టు చేసి జైలుకు పంపిన తర్వాత భాజపా నాయకుల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు అయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడేమో తడి బట్టలతో ప్రమాణం చేస్తానంటారు.. ఈకేసు విచారణ ఆపండి, సీబీఐకి ఇవ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కోర్టులో కేసులు వేస్తారు. తడి బట్టలు, పొడి బట్టలు.. ప్రమాణాలు.. ఏమిటీ విచిత్ర పరిస్థితి.
ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ తెలంగాణకు వచ్చే సరికి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి తయారైంది. తెలంగాణలో కొనుగోలుకు వచ్చి బీజేపీ అడ్డంగా దొరికింది. తెలంగాణ ప్రభుత్వం దొంగలను పట్టుకుని జైల్లో పెట్టింది. సంబంధం లేని కేసులో ఎందుకు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు? సిట్‌ను రద్దు చేయమని ఎందుకు అడుగుతున్నారు? విచారణ జరిగితే బీజేపీ బండారం బయటపడుతుందనే ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి పనులు ఎప్పుడూ చేయమని చెప్పి బీజేపీ నేతలు చేసిన తప్పును ఒప్పుకోవాలి.
బీజేపీ ముందున్న ప్రత్యామ్నాయం ఇదే. దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై వ్యాఖ్యలు చేసింది. దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. కేసు దర్యాప్తు సీబీఐకి ఇవ్వాలంటున్నారు.. తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదా? నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే సిట్ విచారణకు సహకరించాలి. బీజేపీది తెలంగాణ వ్యతిరేక ధోరణి. బీజేపీ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనించాలి. గవర్నర్ తమిళి సై తుషార్ పేరు ఎందుకు ప్రస్తావించారో తెలియదు’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ‘‘ ఉత్తమ విధానాలతోనే ప్రజాస్వామ్య ఫలితాలు అందుతాయి. మంచి పాలనను ప్రజలు హర్షిస్తేనే పార్టీల మనుగడ ఉంటుంది. కానీ, ప్రజల మద్దతు లేకున్నా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ కూలుస్తోంది. బీజేపీ తమదైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదైనా ఘటన జరిగితే ఆధారాలు బయటపెట్టాలని, కేసు విచారణ వేగవంతం చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తాయి. కానీ, అందుకు విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.