ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడడం జట్టులో ఆందోళన రేకెత్తించింది. మంగళవారం నెట్ ప్రాక్టీస్ లో భాగంగా త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు విసిరిన ఓ బంతి నేరుగా వచ్చి రోహిత్ కుడిచేతి మణికట్టుకు కొంచెం పైభాగంలో ముంజేతికి బలంగా తాకింది. దీంతో రోహిత్ బాధతో విలవిల్లాడాడు. రోహిత్‌కు బంతి తగిలిన విషయం గమనించిన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫిజియో కమలేష్ జైన్, టీమ్ డాక్టర్ హుటాహుటిన రోహిత్ వద్దకు చేరుకున్నారు. రోహిత్ ప్రాక్టీస్ ముగించి నొప్పి ఉన్న చోట ఐస్‌ప్యాక్ పెట్టుకుని సుమారు 40 నిమిషాలపాటు కూర్చుండిపోయాడు. అయితే ఆ తర్వాత తిరిగి ప్రాక్టీస్ కొనసాగించాడని, అతడి గాయానికి సీటీ స్కాన్ లేదా ఎక్స్‌రే అవసరం లేదని టీమ్ వర్గాలు తెలిపాయి.