డోన్ లో వార్ వన్ సైడ్..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల వెల్లువ
అభివృద్ధిప్రదాతతో అడుగులు వేసేందుకు భారీగా వలసలు
డోన్ మండలంలో టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన 300 కుటుంబాలు
పట్టణంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి బుగ్గన
డోన్ పట్టణంలో జోరుగా మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారం
డోన్, నంద్యాల జిల్లా, బ్యూరో ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ముట్టుకోని కూటమి మేనిఫెస్టో అమలు సాధ్యమా అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. మేనిఫెస్టో పుస్తకం మీద మోదీ బొమ్మ లేకపోవడం, బీజేపీ ఏపీ ఇంచార్జ్ సిద్ధార్థ్ సింగ్ మేనిఫెస్టో బుక్ లెట్ ను కనీసం ముట్టుకోకపోవడం సామాన్య ప్రజలకు అనుమానాలు రేకెత్తిస్తుందన్నారు. ఇంట్లో పెద్దన్న ఒప్పుకోకుండా ఆడపడచు లాంఛనాలు నిశ్చయించినట్లు..మేనిఫెస్టో అమలు జరగదని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో చదవడానికి తప్ప అమలు జరగడం అసాధ్యమన్నారు. తాత్కాలిక వాగ్ధానాలతో ఎలాగైనా ఎన్నికల్లో గట్టెక్కాలనే ఆలోచన తప్ప నిజంగా వాటిని అమలు చేయడం చంద్రబాబు వల్ల కాదన్నారు. మేనిఫెస్టో మోసగాడు..నెరవేర్చని హామీల మాయలోడు చంద్రబాబని విమర్శించారు. డోన్ పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో సోమవారం మంత్రి బుగ్గన గిరిజనులతో ఆత్మీయ సమావేశం నిర్వహిచారు. డోన్ లో అభివృద్ధి వల్ల ప్రతి వర్గానికి మేలు జరుగుతుందన్నారు. కేంద్రీయ విద్యాలయం రావడం వల్ల ఎస్సీ,ఎస్టీ చిన్నారులకు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. డోన్ లో ఏర్పాటైన ఐటీడీఆర్ ప్రాజెక్టు వలన ఎక్కువ మంది యువతకు ఉద్యోగవకాశాలు దక్కుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే ఆదర్శవంతంగా డోన్ ఐటీఐ హాస్టల్ ను నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. డోన్ ఐటీఐ కాలేజ్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కూడా ఎంతో మందికి ఉపాధినిస్తుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం అంటే ఏ లోటు రానీయకుండా అభివృద్ధి చేయడం కాదా అని మంత్రి ప్రశ్నించారు. అనంతరం డోన్ పట్టణం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్ స్టేషన్ ను మంత్రి బుగ్గన సందర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జరుగుతున్న పోస్టల్ బ్యాటింగ్ ప్రాంతంలో పోలింగ్ సరళిని మంత్రి బుగ్గన పరిశీలించారు. డోన్ నియోజకవర్గానికి సంబంధించిన వివరాలను సంబంధిత మండలాల ఎంఆర్వోలను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలం నేపథ్యంలో ఓ ఫ్యాను తిరగకపోవడాన్ని గమనించి దాన్ని వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. అంతకుముందు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత సుందర్ సింగ్ కాలనీలో క్రైస్తవ మత పెద్దలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంత్రి గెలుపునకు మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాచర్ల గ్రామానికి చెందిన 20 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాయి. అనంతరం పట్టణంలోని 30 కుటుంబాలు మంత్రి బుగ్గన సమక్షంలో వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఆ తర్వాత కాశీం వలి కట్టెల డిపో వీధి నుంచి మంత్రి బుగ్గన తన ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజలతో మంత్రి బుగ్గన మమేకమయ్యారు. చిన్నారులకు చేయి ఊపుతూ పుర ప్రజలకు అభివాదం చేస్తూ హుషారుగా ప్రచారం నిర్వహించారు. ఫ్రిడ్జ్ ఇంతియాజ్ వీధి, సీపీఐ కార్యాలయ వీధి, చిగరమాను పేట మసీదు వీధి, 17వ వార్డు పిండి జిన్ను వీధి ప్రాంతాలలో మంత్రి బుగ్గన ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు. చివరిగా వెంకటాచలం ఫంక్షన్ హాల్ వైపు ప్రచారం ముగించి..అనంతరం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో జరిగిన గిరిజనులతో ఆత్మీయ సమ్మేళన సభకు మంత్రి బుగ్గన హాజరయ్యారు. డోన్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వార్ వన్ సైడ్ గా ట్రెండ్ మారుతోంది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం మొదలుపెట్టిన నాటి నుంచి వలసల జోరు మొదలైంది. డోన్ మండలంలోని లక్ష్మీపల్లె, హుస్సేనాపురం, ధర్మవరం, ఎద్దుపెంట, తారకరామనగర్, ఇందిరానగర్, లక్ష్మిపల్లె, ప్యాపిలి మండలంలోని రాచర్ల గ్రామల నుంచి సోమవారం 300 కుటుంబాలు మంత్రి బుగ్గన సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాయి. డోన్ మండలంలోని లక్ష్మిపల్లె గ్రామం నుంచి 10 కుటుంబాలు, హుస్సేనాపురం నుంచి 20 గ్రామాలు, గుమ్మకొండ గ్రామం నుంచి 60 కుటుంబాలు, ధర్మవరం గ్రామం నుంచి 40 కుటుంబాలు, తారకరామనగర్, ఇందిరానగర్ నుంచి రజక సంఘం సహా 100 కుటుంబాలు, పట్టణం నుంచి 30 కుటుంబాలు, ప్యాపిలిలోని రాచర్ల గ్రామం 20 కుటుంబాలు , ఎద్దుపెంట గ్రామం నుండి 20 కుటుంబాలు వలస వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. తాగునీరు, సాగునీరు, విద్య,వైద్యం, యువతకు ఉపాధి సహా అన్ని రంగాలను సమగ్రాభివృద్ధి చేసిన మంత్రి బుగ్గనకు అండగా నిలవాలనే పార్టీలో చేరుతున్నట్లు గ్రామ ప్రజలు పేర్కొన్నారు. అందరూ కలిసి ఏకతాటిపై నిలిచి రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడంలో సైనికుల్లా పనిచేయాలని మంత్రి బుగ్గన పిలుపునిచ్చారు.