ఎన్నికల ముందొచ్చి నీళ్లు లేవంటున్నారే..ఇన్నాళ్లేం చేశారు?
డోన్ లో వైసీపీలోకి కొనసాగుతున్న వలసల జోరు
డోన్ లో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రచారానికి పోటెత్తిన జనం
మీరొచ్చిన రెండువారాల్లో ఎన్ని గొడవలు? ఎన్నెన్ని కొట్లాటలు?
‘కోట్ల’ స్థానికత ఎక్కడ? 40 ఏళ్ల రాజకీయంలో మీరేం చేశారు?
మంత్రి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 200 కుటుంబాలు
గోసానిపల్లె, చింతలపేట, కొచ్చెరువు గ్రామాల్లో సుడిగాలి పర్యటన
డోన్, నంద్యాల జిల్లా, బ్యూరో ప్రతినిధి: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎన్నికల ప్రచారం జోరు కొనసాగుతోంది. మంత్రి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే వేరే సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో బుగ్గన సమక్షంలో 200 టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వీరందరికీ ఆర్థిక మంత్రి బుగ్గన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డోన్ మండలంలోని బి.రామదుర్గం, 31వ వార్డు , కోట్రాయి గ్రామం, ప్యాపిలి మండలంలోని చిన్నపూదెళ్ల గ్రామాలకు చెందిన 200 కుటుంబాలు మంత్రి బుగ్గన అనతికాలంలోనే చేపట్టిన అభివృద్ధి మెచ్చి పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. అమ్మఒడి వృథా అని..సంక్షేమంతో శ్రీలంకలా దివాళ తీస్తుందన్న వాళ్లే ఇంటిళ్లిపాదికి తల్లికి వందనం చేస్తామని హామీ ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. చేయాల్సిన పనిలేదనే చంద్రబాబు అలవికాని హామీలిచ్చారన్నారు. నిజంగా ప్రజలకు మాటిస్తే చేయాలన్న భయం ఉంటే సీఎం జగన్ లా నిజాయతీగా ఉండేవారన్నారు. మోసాల మేనిఫెస్టోకి..మాట నిలబెట్టుకునే మేనిఫెస్టోకి మధ్య తేడా రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్థానికత ఎక్కడో చెప్పాలని మంత్రి బుగ్గన సూటిగా ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయంలో పదవులు అనుభవించి డోన్ కు ఏం చేశారో చెప్పగలరా అన్నారు. నిజంగా అభివృద్ధి చేసే ఉద్దేశమే మీకుంటే మీకు జన్మనిచ్చిన లద్దగిరికి ఎందుకు రోడ్ కూడా వేయలేకపోయారో చెప్పాలన్నారు. డోన్ లో టీడీపీ అభ్యర్థి ఇటీవల ప్రచారానికి వచ్చి నీళ్లెక్కడ? అనడం విడ్డూరమన్నారు. 40 ఏళ్ల రాజకీయంలో నీళ్లెందుకు ఇవ్వలేదు? అసలెందుకు ఆ దిశగా ఆలోచించలేదో ముందు ప్రజలకు చెప్పాలన్నారు. రూ.351 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టి గోరుకల్లు రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా డోన్ లో ప్రతి ఇంటికి త్వరలో నీరివ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే బేతంచెర్ల మండలానికి నీరిస్తున్న సంగతి ప్రతిపక్షాల పచ్చకళ్లకు కనపడలేదా అని ప్రశ్నించారు. కొట్లాటలు, కక్షలే అభివృద్ధి అనుకునే వారికి డోన్ లో జరిగిన అభివృద్ధి ఏం తెలుస్తుందన్నారు. వచ్చి రెండు వారాలు కాకముందే దాడులు, ఘర్షణలు, రాళ్లతో కొట్టుకోవడాలు , రౌడీ రాజకీయాలు మొదలయ్యాయన్నారు. డోన్ లో మీ ప్రతి కదలికలు..ప్రజలు గమనిస్తున్నారన్నారు. రూ.3వేల కోట్లతో డోన్ ను కనీస సదుపాయాలకు లోటు లేని ప్రాంతంగా కోవిడ్ ను అధిగమించి మూడేళ్ల కాలంలో అభివృద్ధివైపు నడిపించామన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో డోన్ ప్రజల కళ్ల ముందు అభివృద్ధి సాక్షాత్కరిస్తున్న నేపథ్యంలో మరో పార్టీకి స్థానం లేకుండా చేయాలని మంత్రి బుగ్గన పిలుపునిచ్చారు. డోన్ పట్టణంలో శుక్రవారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బేతంచెర్ల సర్కిల్, ఆంజనేయస్వామి కొండ పేట, వెంకటాచలం వీధి, జెండా కట్ట వీధి ప్రాంతాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మంత్రి బుగ్గనకు అడుగడుగునా పట్టణ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి ఆశీర్వదించారు.వృద్ధులు, చిన్నారులు మంత్రి బుగ్గన ప్రచారంలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపారు. కలిసిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ..అభివాదం చేస్తూ..కోవిడ్ వంటి విపత్తును అధిగమించి డోన్ లో చేసిన అభివృద్ధిని గురించి తెలిపే కరపత్రాలను పంపిణీ చేసి వాటిని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గజమాలలు, శాలువాలతో మంత్రి బుగ్గనను ఘనంగా సత్కరించారు. మైనార్టీ సోదరులు మంత్రి బుగ్గన ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆరేళ్ల చిన్నారి మంత్రి బుగ్గన చేపట్టిన అభివృద్ధి గురించి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడింది. దీంతో ఆ చిన్నారికి తెలిసినంత కూడా డోన్ అభివృద్ధి గురించి ప్రతిపక్షాలకు తెలియడం లేదంటూ చమత్కరించి పాప ధైర్యాన్ని మంత్రి బుగ్గన ప్రత్యేకంగా ప్రశంసించారు.