4 అంశాలను లేఖలో ప్రస్తావించిన వైసీపీ
వెలగపూడి నుంచి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలా బహిరంగ సభలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు శుక్రవారం వెలగపూడి సచివాలయం నందు అడిషనల్ సీఈవో హరీంద్ర ప్రసాద్ ను కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. మరీముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొండ, విశాఖ సభలలో జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని పేర్కొన్నారు. వైసీపీ గూండాలు, కాళ్లు విరిగ్గొడతాను, తోలు తీస్తానంటూ విజ్ఞత మరిచి పవన్ మాట్లాడుతున్నారని.. సభ్యసమాజంలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదని అభిప్రాయపడ్డారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు అందించినట్లు తెలిపారు. ఎదురువారిపై బురదచల్లి రాజకీయ లబ్ధిపొందాలనుకుంటే.. ఎంతటివారైనా ప్రజాగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు. 2019 ఎన్నికలలో పోటీచేసిన రెండుచోట్లా.. ఘోర పరాజయం పాలైనా పవన్ తీరు మారలేదన్నారు. ఇప్పటికైనా పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలని.. సీఎం జగన్ పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే.. గాజువాక, భీమవరం సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. మరోవైపు రాయచోటి సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరమని మల్లాది విష్ణు అన్నారు. సైకో అని, బాబాయి – గొడ్డలి అని కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని పదేపదే బహిరంగ సభలలో ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందించినట్లు చెప్పారు. అలాగే ఏలూరు అభ్యర్థులపై ఎల్లో మీడియాలో వచ్చిన కథనాన్ని.. టీడీపీ పెయిడ్ ఆర్టికల్ గా పరిగణించి చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలియజేశారు.
మైనార్టీల గూర్చి మాట్లాడే నైతిక అర్హత బాబుకి లేదు
మైనార్టీల సంక్షేమం గూర్చి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు, కూటమి నేతలకు ఏ మాత్రం లేదని మల్లాది విష్ణు విమర్శించారు. మైనార్టీల అభ్యున్నతికై ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్ తో ఈ రోజున రాష్ట్రంలో ముస్లింలందరూ విద్య, వైద్య రంగాల్లో రాణించి డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని చెప్పారు. కానీ ఆ రిజర్వేషన్ ను తొలగించేందుకు చూస్తున్న పార్టీతో కలిసి.. చంద్రబాబు మైనార్టీల అభ్యున్నతి గూర్చి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ముస్లింలను పట్టించుకున్న పాపానపోలేదని.. గతంతో పోలిస్తే మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో ఎక్కువ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. టీడీపీ గత ఐదేళ్ల పాలనలో మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చుచేసింది కేవలం రూ. 2,665 కోట్లు మాత్రమేనని.. ఈ ప్రభుత్వం వచ్చాక డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అక్షరాలా రూ. 23,176 కోట్ల మేర లబ్ది చేకూర్చినట్లు వివరించారు. పైగా నాలుగున్నరేళ్లు మైనార్టీలను కేబినెట్లో పక్కన కూర్చోబెట్టుకోలేని అసమర్థ నేతకు మైనార్టీల గూర్చి మాట్లాడే అర్హత ఉందో.. లేదో..? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా మైనార్టీలను అగ్రస్థానంలో కూర్చోబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు.
మనసులో మాట పుస్తకం చదివితే బాబు నైజం అర్థమైపోతుంది..
అధికారం కోసం నోటికొచ్చినట్లు మాట్లాడటం బాబుకి కొత్తేమీ కాదని మల్లాది విష్ణు విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల కార్యక్రమాలు పేద ప్రజల జీవన ప్రమాణాలలో ఎంతగానో మార్పు తీసుకొచ్చాయని.. ఆ అక్కసుతో కూటమి, పచ్చ మీడియా నవరత్నాల కార్యక్రమాలపై విషం చిమ్ముతున్నాయని నిప్పులు చెరిగారు. ఓ వైపు నవరత్నాల పథకాలను కాపీ కొడుతూనే.. మరోవైపు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు ప్రభుత్వ పథకాలు, వ్యవస్థల పట్ల, వ్యవసాయం పట్ల, అధికార యంత్రాంగం పట్ల చంద్రబాబుకి ఉన్న అభిప్రాయం ఎటువంటిదో.. ఆయన రాసుకున్న ‘మనసులో మాట’ పుస్తకాన్ని చదివితే అర్థమైపోతుందన్నారు. ఆ పుస్తకం బయటకు వస్తే.. కూటమికి కనీసం డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. బాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు వలసలు పోయి పక్క రాష్ట్రాలలోని దేవాలయాలలో పలహారం తిని బ్రతికిన దయనీయ పరిస్థితులు చూశామని మల్లాది విష్ణు అన్నారు. కానీ సీఎం జగన్ పాలనలో కరోనా లాంటి విపత్తును సైతం ధీటుగా ఎదుర్కొని ప్రజలకు గుడ్ గవర్నెన్స్ ను అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పింఛన్ల విషయంలో రాష్ట్రంలోని లక్షలాది మంది అవ్వాతాతల ప్రస్తుత అవస్థలకు చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ ప్రధాన కారకులని మల్లాది విష్ణు ఆరోపించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఉసురు బాబుకు తప్పక తగులుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.