నీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకులు ద్వారా మంచినీరందించండి
జల్ జీవన్ మిషన్ కింద ఈనెల 13 తర్వాత సిఇఓ అనుమతితో పనులు చేపట్టండి
ఈనెల 2న 28 లక్షల 56 వేల మంది ఉపాధి హామీ పనులకు హాజరు
షెల్ప్ ఆఫ్ ప్రాజెక్టులకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదం
పెద్దఎత్తున పనులు చేపట్టండి
చీఫ్ సెక్రటరి డా.కెఎస్.జవహర్ రెడ్డి
గుంటూరు నుంచి ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యులు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు.తాగునీరు,మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకులు ద్వారా మంచినీటి సరఫరా చేయాలని స్ఫష్టం చేశారు.గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా మంచినీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రక్షిత మంచినీటి సరఫరా పధకాల నిర్వహణ,తాగునీటి అవసరాలకు ఇటీవల కాలువల ద్వారా నీటిని విడుదల చేయగా ఎన్ని సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తిగా నీటితో నింపింది అధికారులతో సమీక్షించారు. జూన్ నెలాఖరు వరకూ ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా నీటి ఎద్దడి అధికంగా గల ఆవాసాలకు ట్యాంకులు ద్వరా నీటిని అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా పరిస్థితులపైన ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించారు.భూగర్భ జల మట్టాల స్థాయి ఏవిధంగా ఉంది ఆశాఖ అధికారులను వివరాలు అడిగి తెల్సుకుని ఎప్పటికప్పుడు భూగర్భ జల మట్టాలను అంచనా వేయాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ కు సంబంధించిన పనులను మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి పనుల ప్రగతిని సమీక్షిస్తూ షెల్ప్ ఆఫ్ ప్రాజెక్టులకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదం తెలిపినందున వేగంగా పనులు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.రాష్ట్రంలో గురువారం 28లక్షల 56 వేల మంది ఉపాధి పనులు నిర్వహిస్తున్నారని పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ సిఎస్ కు వివరించారు. ఈసమావేశంలో రాష్ట్ర జలవనరులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది గల 281 ఆవాసాలకు ప్రస్తుతం ట్యాంకులు ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.మొత్తం 3 వేల 75 ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకులు ద్వారా సరఫరాకు చేసేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందని వివరించారు.కరువు ప్రభావిత మండలాల్లో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు 39 కోట్ల రూపాయలకు ఎన్నికల సంఘం ఆమోదించిందని తెలిపారు.తాగునీటి అవసరాలకై సమ్మర్ స్టోరేజి ట్యాంకులను నీటితో నింపేందుకు ప్రకాశం బ్యారేజి,నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా ఈనెల 1వ తేదీ వరకూ నీటిని విడుదల చేయడం జరిగిందని చెప్పారు.ఉపాధి హామీ పనుల ప్రగతిని వివరిస్తూ గురువారం రాష్ట్రంలో 28లక్షల 56 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,జల వనరుల శాఖ ఇఎన్సి నారాయణ రెడ్డి వర్చువల్ గా పాల్గొన్నారు.ఇంకా ఈసమావేశంలో ఆర్డబ్ల్యుఎస్ ఇఎన్సి కృష్ణారెడ్డి రెడ్డి,పబ్లిక్ హెల్తు అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఇఎన్సి ఆనందరావు, ఎన్ఆర్జిఎస్ డైరెక్టర్ చిన తాతయ్య,జెడి ఎంఏయుడి ఎస్.రవీంద్ర,భూగర్భ జలవనరుల శాఖ డైరెక్టర్ జాన్ సత్యరాజ్,ఎడి విశ్వేశ్వరరావు,తదితర అధికారులు పాల్గొన్నారు.