ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్
వెలగపూడి ప్రధాన ప్రతినిధి : అన్ని రాజకీయ పార్టీలను సమానంగా పరిగణిస్తూ నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను, ఎస్పీలను భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ ఆదేశించారు. ఈ నెల 13 న రాష్ట్రంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, ఎన్నికల సాధారణ, పోలీస్, వ్యయ పరిశీలకులతో న్యూ ఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో చేస్తున్న ఎన్నికల ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబందించిన పలు అంశాల్లో ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలను ఎంతో సునిశితమైన రాష్ట్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు. ఇటు వంటి సమయంలో అధికారులు అంతా ఎంతో అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నిర్వహణలో ఎటు వంటి హింసకు, అల్లర్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకై భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పటిష్టంగా అమలు పర్చారలని, ఎటు వంటి విధానపరమైన లోపాలకు తావు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా కేంద్రాల్లో జరిగే ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కమాండ్ & కంట్రోల్ సెంటర్లలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వెబ్ కాస్టింగ్ పనిచేసే తీరును ఎన్నికల రోజు కంటే ముందుగానే ట్రయల్ రన్ ద్వారా పరీక్షించుకొని సిద్దంగా ఉండాలన్నారు. ఎన్నికల రోజు వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డు అయ్యే ఫీడ్ ను భద్రపర్చుకోవాలన్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బగలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. షాడో ఏరియాల్లో ఉండే పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన కమ్యునికేషన్ వ్యవస్థను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వ్యక్తి గత శ్రద్ద చూపుతూ ఎటు వంటి విమర్శలకు తావులేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఓటింగ్ ఆలస్యంగా చీకటి పడే వరకూ జరగడం గత ఎన్నికల్లో గుర్తించడం జరిగిందని, అందుకు అనుగుణంగా తగు లైటింగ్, బందోబస్తు ఏర్పాట్లను చేసుకోవాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఎవరకూ ఎండకు గురికాకుండా క్యూలైన్లు అన్నీ షామియానాలతో కవర్ అయ్యే విధంగా చూడాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులైన త్రాగు నీరు, ప్రథమ చికిత్స కేంద్రాలు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
ఇ.వి.ఎం.ల నిర్వహణకు సంబందించి ఎన్నికల సిబ్బందికి తగు ముందస్తు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని, ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తినా వెంటనే ఆ సమస్యను సరిదిద్దుకునే కనీస పరిజ్ఞానం వారికి ఉండేలా శిక్షణను ఇవ్వాలన్నారు. ఈ విషయంలో పరిశీలకులు ఎంతో అప్రమ్తతంగా ఉండాలన్నారు. కేంద్రీకృతంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాల ద్వారా ఎన్నికలకు ముందు ఇ.వి.ఎం.ల పంపిణీ, ఎన్నికల తదుపరి వాటి సేకరణ, భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆయా కేంద్రాల్లో అపరిచితులను అనుమతించ వద్దని, పాస్ లను జారీ చేయడం ద్వారా ఆయా కేంద్రాల్లో రాకపోకలను నియంత్రించాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఉచితాల అక్రమ రవాణాను నియంత్రించాలని, ఇందుకై రాష్ట్ర సరిహద్దులు, జిల్లా సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టుల్లో నిరంత నిఘా ఉంచాలన్నారు. ప్రత్యేకించి జాతీయ రహదారుల్లో వాహనాల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్నికల సరళి సజావుగా సాగే విషయంలో ఎన్నికల సాధారణ, పోలీస్, వ్యయ పరిశీలకు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అదే విధంగా ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు, అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని నియంత్రించేందుకు, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు. ఏపీఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ అతుల్ సింగ్, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి మరియు అడిషనల్ డిజిపి (లా & ఆర్డర్) ఎస్.బాగ్చీ, అదనపు సీఈవో ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, ప్రొవిజన్ & లాజిస్టిక్ ఐజీపీ వెంకట్రామిరెడ్డి, టెక్నికల్ సర్వీసెస్ ఐజిపి ఎస్ హరికృష్ణ, సెబ్ ఐజి రవి ప్రకాష్, లా అండ్ ఆర్డర్ డిఐజి సెంథిల్ కుమార్, కమ్యూనికేషన్ డి ఐ జి ఎన్ ఎస్ జె లక్ష్మి తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, ఎన్నికల సాధారణ, పోలీస్, వ్యయ పరిశీలకులు వారి జిల్లాలు, ప్రాంతాల నుండి ఈ వీడియో కాన్పరెన్సులో పాల్గొన్నారు.