ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో కీలకపాత్ర
సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి
ఎన్టీఆర్ జిల్లా బ్యూరో ప్రతినిధి : సమాచార, పౌర సంబంధాల శాఖలో ప్రచార సహాయకులు, దృశ్య శ్రవణ సూపర్వైజర్గా 33 సంవత్సరాలపాటు సుదీర్ఘ సేవలందించిన ఆగం సాయిబాబా ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఆడియో విజువల్ సూపర్వైజర్ (ఏవీఎస్)గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆగం సాయిబాబాకు ప్రభుత్వ అతిథిగృహ ఆవరణలో గల డీఐపీఆర్వో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అభినందన సభకు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సాయిబాబా దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవడంలో సమాచార శాఖ కీలకపాత్ర వహిస్తుందన్నారు. ప్రభుత్వ శాఖల్లో అత్యంత కీలకమైన సమాచార శాఖలో విధులు నిర్వర్తించడం చాలా ఒత్తిడితో కూడుకున్నదన్నారు. 33 ఏళ్ల పాటు కాకినాడ, రాజమండ్రి, మచిలీపట్నం, విజయవాడలోని కార్యాలయాల్లో అలుపెరగని సేవలందించి ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం, ఛాయాచిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వంటి విషయాల్లో సాయిబాబా ప్రతిభ నేటితరం ఉద్యోగులు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరముందన్నారు. దాదాపు 10 మందికిపైగా జిల్లా కలెక్టర్ల వద్ద పనిచేసి ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకొని నేడు పదవీ విరమణ చేస్తున్న సాయిబాబా సేవలను భవిష్యత్తులో సమాచార శాఖ వినియోగించుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ అదనపు సంచాలకులు ఎల్.స్వర్ణలత, సంయుక్త సంచాలకులు పి.కిరణ్కుమార్, టి.కస్తూరి, రీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ సీవీ కృష్ణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ బి.పూర్ణచంద్రరావు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎం.భాస్కర్ నారాయణ, జీవీ ప్రసాద్, డీఐపీఆర్వో యు.సురేంద్రనాథ్, డీపీఆర్వో ఎస్వీ మోహన్రావు, డివిజనల్ పీఆర్వో కె.రవి, పబ్లిసిటీ సహాయకులు వీవీ ప్రసాద్, కమిషనర్, రీజనల్ జాయింట్ డైరెక్టర్ సహాయ సంచాలకులు, జిల్లా సమాచార శాఖ ఉద్యోగులు, సిబ్బంది హాజరయ్యారు.