ఎన్నికల కమిషన్‌కు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు
జగన్ రెడ్డి రాజకీయ లబ్ధి చేకూర్చాలని సీఎస్ జవహార్ రెడ్డి ఆరాటపడుతున్నారు
పెన్షన్ సొమ్మును బ్యాంకులో వేసి మండుటెండల్లో పెన్షన్ దారులను బ్యాంకుల చుట్టూ తిప్పాలని కుట్ర పన్నిన సీఎం, సీఎస్, సెర్ఫ్ సీఈఓ, సెర్ఫ్ ఎండీ
శవ రాజకీయాలు చేయడం కోసం 33మంది వృద్ధులను జగన్ రెడ్డి ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది
ఈసారి ఒక్క వ్యక్తి మరణించినా, దానికి పూర్తి బాధ్యత జగన్ మోహన్ రెడ్డి వహించాలి
రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై, ప్రచార వాహనాలపై ఎన్ని దాడులు జరుగుతున్నా రిటర్నింగ్ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారు
వైసీపీలో చేరనందుకు రాప్తాడులో ఇద్దరు దళితులను, దానిని ప్రశ్నించిన బీసీ నాయకుడిపై దాడి దుర్మార్గం
న్యాయన్ని, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీ నాయకులకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు
టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా
వెలగపూడి, ప్రధాన ప్రతినిధి : ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసే అవకాశమున్నా పెన్షన్ దారులను ఇబ్బందులు పెట్టాలనే దురుద్దేశంతోనే బ్యాంకుల్లో పెన్షన్‌ను జమ వేస్తామనడం దుర్మార్గమని, జగన్ రెడ్డికి రాజకీయ లబ్దీ చేకూరేందుకే సీఎస్ జవహార్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు. నాలుగు ఎన్డీఏ ప్రచారా వాహనాలు ధ్వంసం, రాప్తాడు నియోజకవర్గంలో ఇద్దరు దళిత నాయకులు, ఒక బీసీ నాయకుడిపై వైసీపీ నాయకుల దాడిపై కూడా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య, దేవినేని ఉమా పాల్గొన్నారు.
జగన్ రెడ్డికి ఎన్నికల్లో లబ్దీ చేకూర్చాలనే సీఎస్ జవహార్ రెడ్డి పనిచేస్తున్నారు : వర్ల రామయ్య
“పెన్షన్‌దారుల ప్రాణాలు తీయడానికి సీఎస్ జవహార్ రెడ్డి కుట్ర పన్నారు. దుర్మార్గపు ప్రభుత్వం వల్ల పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు వృద్ధుల జీవితాలు పడ్డాయి. 65 లక్షల పెన్షన్‌దారులకు 49 లక్షల మందికి బ్యాంకుల్లో పెన్షన్ జమ వేస్తామనడం దుర్మార్గం. ఎంతమంది ప్రాణాలు పోయినా మేము పట్టిన పట్టును వీడము అన్నట్లు పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేయాలని మేము ఎన్నిసార్లు కోరినా జగన్ రెడ్డికి రాజకీయ, ఎన్నికల లబ్దీ చేకూర్చాలనే దుర్మార్గపు ఆలోచనతో సీఎస్ జవహార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం” అని అన్నారు.
న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులే వైసీపీ నాయకులకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు
“పోలింగ్ తేది సమీపిస్తున్నా కూడా ఇంకా రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి రావాలని ఇద్దరు దళిత యువకులను చావగొట్టి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టారు. ఇదేమిటని ప్రశ్నించిన ఓ బీసీ నాయకుడిపై ఇష్టానుసారంగా దాడి చేశారు. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులు ఎమ్మెల్యేకు సెల్యూట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికి నాలుగు ప్రచార రథాలను అధికార పార్టీ మూకలు తగలబెట్టారు. దేనిపై కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. వైసీపీ నాయకులకు చట్టాలు వర్తించడం లేదని ఈసీకి ఫిర్యాదు చేశాం” అని తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల విధుల్లో ఉన్న ఆంధ్ర స్పెషల్ పోలీసు అధికారులకు పోస్టల్ బ్యాలెట్ కల్పించాలి
“వెయ్యి మంది స్పెషల్ పోలీసు అధికారులు మహారాష్ట్రలో ఎన్నికల విధులకు వెళ్లారు. మన రాష్ట్రంలో మే 13న జరగబోయే ఎన్నికల్లో వారు ఓటు హక్కు వినియోగించుకోలేరు. కాబట్టి వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కల్పించాలి. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతీ వ్యక్తి పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. మహారాష్ట్రలో ఎన్నికల విధుల్లో ఉన్న వెయ్యి మంది మన రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వని పక్షంలో మే 13 పోలింగ్ రోజున ఇక్కడికి వచ్చి వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశాం”అని తెలియజేశారు.
ప్రజాక్షేత్రంలో తెల్చుకుందాం రా జగన్ రెడ్డి
“దొడ్డ దారుల్లో దొంగ బుద్ధులు ప్రదర్శించి అధికారం నిలబెట్టుకోవాలనే పగటి కలలను కనడం మానెయ్ జగన్ రెడ్డి..! నిజంగా ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. గులకరాయి తగిలింది, తలకి గాయమైందని ప్లాస్టర్ వేసుకొని జనాలను మభ్య పెట్టే ప్రయత్నం జగన్ రెడ్డి చేశారు. కానీ జగన్ రెడ్డి మోసాలను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇక చేసేది లేక తలకున్న ప్లాస్టర్‌ను తీసి చూస్తే గాయమైన ఆనవాలు కూడా జగన్ రెడ్డి తలపై లేదని ఎద్దేవా చేశారు.
ఒక్క పెన్షన్ దారుడు మరణించినా సీఎం, సీఎస్, సెర్ఫ్ అధికారులు బాధ్యత వహించాలి : దేవినేని ఉమా
“మూడున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు. ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసే అవకాశాలున్నాయి. కానీ దురుద్దేశపూర్వకంగానే సీఎస్ జవహార్ రెడ్డి దుర్మార్గపు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీకి ఎన్నికల్లో లబ్దీ చేకూర్చే విధంగా సీఎస్ జవహార్ రెడ్డి ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో బ్యాంక్ ద్వారా పెన్షన్లు ఇవ్వడం కష్టమని, కుదరదని, పెన్షన్ దారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సెర్ఫ్ సీఈఓ, ఎండీ ఇతర అధికారులు మొదట చెప్పినా కూడా 10 రోజుల్లో వారు తమ మాటలను మార్చి బ్యాంకుల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని నిర్ణాయాలు తీసుకున్నారు. పెన్షన్ డబ్బులు ఏ బ్యాంకులో పడ్డాయో సచివాలయానికి వెళ్ళి తెలుసుకోవాలని ఆదేశాలివ్వడం దుర్మార్గపు ఆలోచన. శవ రాజకీయాల చేయడం కోసం వృద్ధుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుంది. 33 మంది వృద్ధులను పొట్టన పెట్టుకొని జగన్ రెడ్డి ప్రభుత్వం ఆడిన డ్రామాను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఈసారి పెన్షన్ పంపిణీ వ్యవహారంలో ఏ ఒక్క మరణం సంభవించినా అది సర్కారి హత్యలే. అందుకు పూర్తి బాధ్యత సీఎం జగన్ రెడ్డి, సీఎస్ జవహార్ రెడ్డి, సెర్ఫ్ సీఈవో శశిభూషన్, ఎండీ మరళీధర్ రెడ్డిలే వహించాలి” అని హెచ్చరించారు.
ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నా రిటర్నింగ్, పోలీసు అధికారులు ఏమి చేస్తున్నారు?
“ఇద్దరు తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు వైసీపీలో చేరమంటే చేరడం లేదని వారిని కొట్టడమే కాకుండా ఇదేమిటని ప్రశ్నించిన బీసీ నాయకుడిపై కూడా కిరాతంకా దాడి చేశారు. నాలుగు ప్రచార వాహనాలను ధ్వంసం చేశారు. పోలింగ్ తేది దగ్గరపడుతున్నా కూడా ప్రతిపక్షాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా రిటర్నింగ్ అధికారులు, పోలీసులు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు. వీటన్నిటిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలిజయేశాం. మంగళవారం రాష్ట్రానికి రానున్న పోలీసు పరిశీలకుడిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తాం” అని దేవినేని ఉమా తెలిపారు. ఎన్నికల కమిషన్‌ను కలిసిన వారిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రమయ్య, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావులతో పాటు శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవి రావు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.