ఇద్దరు ‘కే’లు కలిస్తే మరలా కల్లోలమే : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
మీ కలయిక ప్రజల శాంతి కోసమా? మీ ఇరువురి అధికారం కోసమా?
గత 75 ఏళ్లలో జరగని అభివృద్ధి గత నాలుగేళ్లలో జరిగింది వాస్తవం కాదా?
ప్యాపిలిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
నంద్యాల బ్యూరో ప్రతినిధి : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్యాపిలి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్.రాచర్ల, బోయినచెరువు పల్లె, కొమ్మెమర్రి, హుస్సేనాపురం, వెంగళాంపల్లె గ్రామల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రాచర్ల గ్రామంలో మంత్రి మాట్లాడుతూ బతుకు కోరేవారు కావాలో..బలికోరుకునేవారు కావాలో ప్రజలు విచక్షణ, విజ్ఞతతో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. పది మంది బతుకు కోరేవాడు నాయకుడు..తాను నాయకుడిగా ఎదగడం కోసం అమాయక ప్రాణాలను బలి చేసేవాడు స్వార్థపరుడన్నారు. ఇద్దరు ‘కే’లు కలిస్తే డోన్ నియోజకవర్గంలో కల్లోలం మొదలవుతుందన్నారు. మంచి చేశానని నమ్మి ప్రజలు మరో అవకాశమిస్తే అభివృద్ధి కొనసాగుతుందన్నారు. మూడుతరాల పోరు అధికారం కోసం కలిసిపోతే అమాయకుల ప్రాణాలు తిరిగొస్తాయా అని ప్రశ్నించారు. శాంతి కోసమో, అవగాహనతోనో కాకుండా ..ఎన్నికల ముందు అధికార దాహంతో రెండు వర్గాలు చేతులు కలపడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కలయికను ఆయా నాయకుల వెంట ఉండి ప్రాణాలు కోల్పోయి, కేసులతో సర్వం కోల్పోయి, ఇంటి పెద్దలను దూరం చేసుకుని దిక్కులేని వాళ్లుగా మిగిలిపోయిన బాధిత కుటుంబాలు హర్షిస్తాయా? ప్రజలు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. డోన్ కు వచ్చిన 15 రోజులకే జీపులు వేసుకుని వచ్చి కుర్చీలతో కొట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మరలా ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడానికి వచ్చారా అంటూ ప్రశ్నించారు. నేతలు వారి స్వార్థానికి జై కొట్టి..ఇన్నాళ్లు ఎవరితోనైతే ఫ్యాక్షన్ నడిపారో ఇపుడు వారితోనే కలిసిపోవడం ఏం రాజకీయమన్నారు. డోన్ లో తిరుగుతూ ప్యాపిలిలో కొట్టుకుని బేతంచెర్ల మీదుగా వెళ్లి లద్దగిరిలో కూర్చుంటారా అన్నారు. ప్రతీకార దాడులు, ఘర్షణలు ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్ ఎలా ఉంటుందో ప్రజలే తేల్చుకోవాలన్నారు. కత్తులు దూసుకునే రాజకీయాలతో మరలా ఇంకెంత మందిని బలి చేయాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. ప్రజలకోసం , ప్రజా క్షేమం కోసం, కులమతాలకతీతంగా చేసిన అభివృద్ధి కోసం మేమున్నంత వరకూ ప్రజలను రౌడి రాజకీయాల నుంచి కాపాడుకుంటామన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరగని అభివృద్ధిని గత నాలుగేళ్లలో చేసి చూపించామన్నారు. కోవిడ్ విపత్తులోనూ ప్రగతి సాధించిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏళ్లకేళ్ల రాజకీయంలో పదవులు అనుభవించి కూడా పలానా చేశామని చెప్పుకోలేని కూటమి ఏం అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించి ఎవరు మంచి చేశారో గమనించి ఆలోచించి మరి ఎన్నుకోవాలని మంత్రి బుగ్గన పిలుపునిచ్చారు. మోసానికి అలవాటు పడిన చంద్రబాబు ఎన్ని అబద్ధాల హామీలైనా చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నించడంలో భాగమే సూపర్ సిక్స్ అన్నారు. గతంలో హామీల లాగే అవి కూడా ఏరు దాటాకా తెప్ప తగిలేసే పథకమే తప్ప అవి సంక్షేమ పథకాలు కావన్నారు.