మూడు అంశాలను లేఖలో ప్రస్తావించిన వైసీపీ
విజయవాడ బ్యూరో ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన పాటలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాకు శనివారం ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఈమేరకు వెలగపూడి సచివాలయం నందు ఆధారాలతో సహా ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే మార్కాపురం, ఎమ్మిగనూరు, బాపట్ల సభలలో చంద్రబాబు వాడిన భాషపై ఈసీ నోటీసులు ఇవ్వడం జరిగిందని, అయినా తీరు మారకపోవడం శోచనీయమన్నారు. పైగా మరలా బహిరంగ సభలలో గంజాయి ఫ్యామిలీ, శవ రాజకీయాలు అంటూ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీనిపై ఈసీకి మరోసారి ఫిర్యాదును అందించినట్లు తెలిపారు. అలాగే ఐ-టీడీపీ వెబ్ సైట్లో ముఖ్యమంత్రిని కించపరుస్తూ ‘సైకో పోవాలి – సైకిల్ రావాలి’ అనే పాటను పదేపదే ప్రదర్శిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. నరసాపురం సభలోనూ ఆ పాట ప్రదర్శించిన సమయంలో బాబు హావభావాలు జుగుప్సాకరమని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజలకు ఓ భరోసా కల్పించవలసిన నేతలు ఈవిధంగా దిగజారి ప్రవర్తించడాన్ని ఆయన తప్పుబట్టారు. పైగా ఆ పాటలో కులాలు, మతాల ప్రస్తావన ఉండటంపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ముఖ్యమంత్రిని కించపరిచేలా ప్రదర్శిస్తున్న పాటను తక్షణమే నిలుపుదల చేయాలని కోరినట్లు చెప్పారు. అదేవిధంగా సీమ చెల్లెమ్మ పాటపై కూడా ఫిర్యాదును అందించినట్లు పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలకు ఒక అజెండా అంటూ లేదని కేవలం ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం, అధికార పక్షాన్ని దుర్భాషలాడటానికే ప్రతిపక్షాలు పరిమితమయ్యారని మండిపడ్డారు. అంతేకానీ ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కూటమి నేతలకు ఏమాత్రం లేదని నిప్పులు చెరిగారు. మరోవైపు రాష్ట్రంలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అక్కసు వెళ్లగక్కుతున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు.
నిష్పక్షపాతంగా పనిచేస్తున్న 22 మంది అధికారులకు రాజకీయ రంగు పులమడం ఏమాత్రం సరికాదన్నారు. అరకొర సీట్లలో పోటీచేస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదును అందించడం వెనుక ఎవరున్నారో ఈపాటికే ప్రజలు గ్రహించారన్నారు. కనుక మైండ్ గేమ్ ఆడుతూ అధికారులపై ప్రజలలో తప్పుడు సంకేతాలు పంపుతున్న బీజేపీ అధ్యక్షురాలిపై చర్యలు తీసుకోవలసిందిగా ఈసీని కోరినట్లు మల్లాది విష్ణు చెప్పారు. అలాగే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు కోర్టు పరిధిలో ఉన్న వివేకానంద రెడ్డి కేసుపై బహిరంగ సభలలో పదేపదే మాట్లాడుతూ ఎంపీ అవినాష్ రెడ్డిపై నిందారోపణలు చేయటంపై కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందించడం జరిగిందన్నారు. 30 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఈపాటికే ఎన్నో అద్భుతాలు చేసి ఉండవచ్చని, కానీ ఒక యువ ముఖ్యమంత్రితో పోటీపడలేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడూ ప్రజలతో మమేకం కాలేదని, కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. కనుక ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఈ ఎన్నికలలో ప్రజల చల్లని దీవెనలతో 175 స్థానాలలో వైసీపీ విజయదుందుభి మ్రోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ఉన్నారు.