అందరికీ అన్నీ ఇచ్చింది ఆయనే
రోడ్లు, లైట్లు.. చివరకు శ్మశానాలూ కట్టించారు
ఆయన్ను మళ్లీ ప్రధానిగా చేసుకోవాలి
మోమిన్‌పేట మండల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మోమిన్‌పేట : ఎప్పుడో 500 ఏళ్ల ముందు నాటి పాలకులు ధ్వంసం చేసిన రామ మందిరాన్ని తిరిగి కట్టించినది, అందులో బాలరాముడిని ప్రతిష్ఠింపజేసినది ప్రధానమంత్రి నరేంద్రమోదీయేనని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మనమంతా ఇచ్చిన పది, 20 రూపాయల విరాళాలతోనే ఆ ఆలయం రూపొందిందని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోమిన్‌పేట మండలంలో శనివారం ఆయన మండుటెండలో పలు గ్రామాల్లో తిరిగారు. ఈ సందర్భంగా కొత్త కోల్కుండ్, అమ్రాది ఖుర్దు గ్రామాల్లో మాట్లాడుతూ, భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మనందరికీ అక్షతలు కూడా వచ్చాయని, అప్పుడు చాలామందికి నమ్మకం కుదిరిందని చెప్పారు.
“మూడేళ్ల ముందు బియ్యం ఎవరిస్తున్నారంటే కేసీఆర్ అని చెప్పేవారు. నిజానికి బియ్యం దగ్గర నుంచి పొలాలకు ఎరువులు, రోడ్లు, లైట్లు, రైతు వేదికలు, చివరకు శ్మశాన వాటిక కూడా ఆయనే కట్టించారు. ఒక్క వ్యక్తి ఎన్నో చేశారు. ఉపాధి హామీ పథకంతో పని కల్పిస్తున్నా, అందులో డబ్బులు లంచాలకు ఇవ్వాల్సి వచ్చేది. దాంతో చేతికి ఏమీ అందేది కాదు. దాంతో అందరికీ ముందుగా జన్‌ధన్ ఖాతాల పేరుతో బ్యాంకు ఎకౌంట్లు తెరిపించారు. ఆయనకు ముందు ఇక్కడ ఎంతమందికి బ్యాంకు ఎకౌంట్లు ఉన్నాయి? ఆ ఎకౌంట్లు వచ్చిన తర్వాత ఉపాధి హామీ వేతనాలన్నింటినీ వాటిలోనే వేయించడం మొదలుపెట్టారు. దాంతో ఎవరికీ రూపాయి కూడా లంచం ఇవ్వక్కర్లేకుండా సంపాదించిన మొత్తం మీ జేబుల్లోకే రావడం మొదలైంది. చేసింది ఆయన, చెప్పుకునేది మాత్రం వీళ్లు. మోదీ ఎప్పుడూ నేను ఇది చేశాను, అది చేశాను, ఓట్లేయండని అడగలేదు. ఇప్పుడు జరుగుతున్నవి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కావు.. యావత్ భారతదేశంలో మన ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎన్నికలు. మోదీకి ఎదురు ఎవరూ లేరు. ఉన్నవాళ్లు పారిపోతున్నారు. వాళ్ల నియోజకవర్గాలు వదిలి మరీ పారిపోతున్నారు. మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తోంది, అందులో అనుమానం లేదు. అందుకే మనందరం కలిసి మోదీని మళ్లీ బలోపేతం చేసుకోవాలి. దేశంలో 400కు పైగా స్థానాలు రావాలంటే ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి. ఇక్కడ పువ్వుగుర్తుకు ఓటేస్తే అక్కడ మోదీ గెలుస్తారు, మళ్లీ ప్రధానమంత్రి అవుతారు, మరింత గొప్పగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతారు. మనందరి బతుకులు బాగుపడతాయి” అని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు.