ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరిన వైసీపీ
విజయవాడ బ్యూరో ప్రతినిధి : రాష్ట్రంలో నిష్పక్షపాతంగా పనిచేస్తున్న అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న తెలుగుదేశంపై చర్యలు తీసుకోవలసిందిగా ఎన్నికల కమిషన్ కు శుక్రవారం రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఈమేరకు వెలగపూడి సచివాలయం నందు ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా చంద్రబాబు, తెలుగుదేశం నేతలు పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. బహిరంగ సభలలో ముఖ్యమంత్రి గూర్చి నీచంగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుండటమే కాకుండా చివరకు అధికారులు, ఉద్యోగులపైనా అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. వీటన్నింటిని ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ పైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని మల్లాది విష్ణు అన్నారు. దీనిపై ఆధారాలను ఈసీకి సమర్పించినట్లు చెప్పారు. యనమల రామకృష్ణుని అల్లుడు చావలి వెంకట గోపినాథ్ ఓ ఐఆర్ఎస్ అధికారి అయి ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ట్యాబ్ లు పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురిచేయడంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందజేసినట్లు తెలిపారు. గోపినాథ్ పై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని.. తునిలోని పారిశ్రామికవేత్తలను ఆయన బెదిరిస్తూ దందాలు చేస్తున్నారన్నారు. దీనికి సంబంధించి అక్కడి వైసీపీ అభ్యర్థి ఇచ్చిన ఫిర్యాదును కూడా ఈసీకి సమర్పించడం జరిగిందన్నారు. మరోవైపు ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని ఏలూరు సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను పూర్తిగా విస్మరించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి.. ఏపీలో ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడిదని సూటిగా ప్రశ్నించారు. అలాగే వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఈసీ రాసిన లేఖపై సకాలంలోనే వివరణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన మంచి పనులు వివరిస్తూ తామంతా ఓట్లు అభ్యర్థిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. కానీ చెప్పుకునేవి లేక తెలుగుదేశం విష ప్రచారానికి పరిమితమైందని, అయినా ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలంగా ఉన్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కనుకనే ద్వేషంతో చంద్రబాబు, టీడీపీ నేతలు వ్యవస్థలపైన దాడి చేస్తున్నారని మండిపడ్డారు. గత రెండు నెలలుగా తెలుగుదేశం ఆడుతున్న డ్రామాలు, చేస్తున్న గోబెల్స్ ప్రచారాలను ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నాగ నారాయణ మూర్తి, వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ఉన్నారు.