విజయవాడ, బ్యూరో ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న దిగజారుడు వ్యాఖ్యలపై అడిషనల్ సీఈవో కోటేశ్వరరావుకు సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పట్ల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు వాడుతున్న పదజాలం తీవ్ర అభ్యంతరకమని మల్లాది విష్ణు అన్నారు. ఇప్పటికే మార్కాపురం, ఎమ్మిగనూరు, బాపట్ల బహిరంగ సభలలో సీఎంను కించపరిచేలా బాబు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందించినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై వైసీపీ అందించిన ఫిర్యాదు పట్ల స్పందించిన ఈసీ చంద్రబాబుకు నోటీసులు అందించిందని, అయినా ఆయన తీరు మారకపోవడం బాధాకరమన్నారు. మరోసారి కొత్తపేట సభలోనూ ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రవర్తించారని, దీనిపై ఆధారాలతో సహా ఫిర్యాదు అందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. అలాగే ప్రతిఒక్క సభలోనూ బాబు నిబంధనలు అతిక్రమించడంపై ఈసీకి ఆధారాలు సమర్పించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వివేకానంద హత్య కేసుకు సంబంధించి బాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
మరోవైపు తెలుగుదేశం కుట్రల వల్ల ఆవేదనతో పింఛన్ దారులు మృతి చెందితే దానిని కూడా ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ బాబు వ్యంగ్యంగా మాట్లాడటంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. పైగా శవరాజకీయాలు చేస్తూ జోగి రమేష్, పేర్ని నానిలపై టీడీపీ నేతలు బురదచల్లడం విడ్డూరంగా ఉందన్నారు. కనుక విశ్వసనీయత లేని చంద్రబాబు, తెలుగుదేశం నేతల మాటలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరని మరలా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.