హైదరాబాద్ : సోషల్ మీడియా ఎంత వేగవంతమైనా, అందులో పూర్తి విశ్వసనీయత మాత్రం ఉండదని, ప్రజా సంబంధాలతోనే నమ్మకం అనేది సాధ్యం అవుతుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. బుధవారం బేగంపేట్ లోని టూరిజం ప్లాజా హోటల్ లో జరిగిన పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 20వ, వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఆయన విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయా సంస్థల అధిపతులకు గానీ, ప్రభుత్వాలకు గానీ ప్రజల్లో ఖ్యాతి తెచ్చి పెట్టే శక్తి కేవలం పబ్లిక్ రిలేషన్స్ లోనే ఉందని విరాహత్ అలీ స్పష్టం చేశారు. ఆయా సంస్థలకు, ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలను నిర్మించే వ్యూహాత్మాక కమ్యూనికేషన్స్ ప్రక్రియే పబ్లిక్ రిలేషన్స్ అని ఆయన చెప్పారు. సంస్థల, వ్యక్తుల బ్రాండ్ ఇమేజ్ పీఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్ వేదికగా వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థకు విరాహత్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, పి.ఆర్.సి.ఐ జాతీయ చైర్మన్ ఎం.బి.జయరాం, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపం రెడ్డి, పిఆర్సిఐ జాతీయ ప్రతినిధులు గీతా శంకర్, వినయ్ కుమార్, హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు షకీల్ అహ్మద్, జాకబ్, మైకేల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖులకు పురస్కారాలు : పీఆర్సిఐ 20వ, వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖులకు అతిథుల చేతుల మీదుగా పురస్కారాలు అందించారు. ఇందులో భాగంగా సాక్షి పబ్లికేషన్స్ మార్కెటింగ్ డైరెక్టర్ కె.ఆర్.పి.రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వేస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సి.హెచ్.రాకేష్, ప్రముఖ గాయకులు అనుజ్ గుర్వారా, ఎన్ ఎం డీ సి జనరల్ మేనేజర్ జయప్రకాశ్, ఆర్.కె.స్వామి మీడియా గ్రూప్ జీయం అనురాధ కిషోర్, వార్త బ్యూరో చీఫ్ డాక్టర్ వై. నాగేశ్వర్ రావు, మీడియా ప్లస్ వ్యవస్థాపకులు సయ్యద్ ఫాజిల్ హుసేన్ పర్వేజ్ తదితరులు పురస్కారాలు అందుకున్నారు.