న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను 6 రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది. మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసిన ఈడీ.. శుక్రవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారుగా పేర్కొంటూ ఆయన్ను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరగా రెండున్నర గంటల పాటు వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ అంశంపై తాజాగా తీర్పును వెలువరించారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి సహా పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. ‘సౌత్ గ్రూప్’ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. ‘‘మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్‌పిన్. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలుకు ‘సౌత్ గ్రూప్’ సంస్థ నుంచి రూ.కోట్ల ముడుపులు అందుకున్నారు. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్లు డిమాండ్ చేశారు. రూ.45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారు. అవి నాలుగు హవాలా మార్గాల నుంచి వచ్చాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు చట్టవిరుద్ధమని, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లేవని సీఎం తరపు న్యాయవాదులు వాదించారు.