జలదంకి బ్రాహ్మణక్రాక ప్రధాన రహదారి అభివృద్ధి చేస్తా
వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధి పనులు చేపడతాం
జగన్మోహన్ రెడ్డి ప్రతినిధులకు అడుగడుగునా బ్రహ్మరథం
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ది, ఎంపీ విజయసాయి రెడ్డి
ఉదయగిరి బ్యూరో ప్రతినిధి : ఇతర దేశాల్లో నివాసం ఉండే ఎన్ఆర్ఐలు, విదేశాల్లో వ్యాపారం చేసుకునే వారిని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఉదయగిరి శాసనసభ అభ్యర్థిగా, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్దిగా నిలబెట్టిందని, అటువంటి వారు ఇక్కడి ప్రజలకు ఎలా సేవ చేయగలరో ప్రజలు అలోచించాలని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వి. విజయసాయి రెడ్డి కోరారు. ఈ మేరకు ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణక్రాక గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉండలేని వ్యక్తులు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారని ప్రశ్నించారు. వారానికి కనీసం రెండు రోజులు స్థానికంగా ప్రతిపక్ష పార్టీ ఎంపీ అభ్యర్ది ఉండలేరన్నారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. వారానికి తాను 5 రోజులు నెల్లూరులో ఉంటానని, మిగతా రెండు రోజులు విజయవాడలో ఉంటానన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణల్లో అర్దం లేదన్నారు. ప్రజల కష్టాలే తమ కష్టాలుగా భావించి తాను, మేకపాటి రాజగోపాల్ రెడ్డి పనిచేస్తామని అన్నారు.
నెల్లూరు ప్రజలు వినయం, విధేయతకు మారుపేరని అన్నారు. నెల్లూరు వాణిని నేను పార్లమెంటులో, ఉదయగిరి వాణిని రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో వినిపిస్తామని అన్నారు. ఇదే గ్రామానికి వైఎస్సార్సీపీకి చెందిన ఓ వ్యక్తి ప్రతిపక్ష పార్టీకి అమ్ముడుపోయారని అటువంటి వ్యక్తుల మాటలు నమ్మవద్దని కోరారు. జలదంకి బ్రాహ్మణక్రాక ప్రధాన రహదారి అభివృద్ధి చేస్తానని అలాగే వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇస్తున్నానని అన్నారు. 5 సంవత్సరాల కాలం పాటు ప్రజల కష్టాలను తీర్చి సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం వచ్చిందని, వైఎస్సార్సీసీ అభ్యర్థులను ఓటుతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మరోమారు సీఎం కుర్చీపై కూర్చోబెట్టాలని కోరారు. అంతకు ముందు గ్రామానికి చేరుకున్న విజయసాయి రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జేజేలు పలుకుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతినిధులపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి అభినవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీ బైక్ ర్యాలీ : జలదంకి మండలం జమ్ములపాలెం నుండి బ్రహ్మణక్రాక వరకు భారీ బైక్ ర్యాలీ సాగింది. నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాలరెడ్డిలకు ప్రజలు,కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. బ్రాహ్మణ క్రాకలోని వేణుగోపాలస్వామి ఆలయంలో విజయసాయిరెడ్డి, మేకపాటి రాజగోపాలరెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.