న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. ‘సౌత్ గ్రూప్’ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఆయన్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. 10 రోజుల రిమాండ్ కోరారు. ‘మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్‌పిన్. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలుకు ‘సౌత్ గ్రూప్’ సంస్థ నుంచి రూ.కోట్ల ముడుపులు అందుకున్నారు. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్లు డిమాండ్ చేశారు. రూ.45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారు. అవి నాలుగు హవాలా మార్గాల నుంచి వచ్చాయని ఈడీ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో కేజ్రీవాల్‌ను గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టుపై కేజ్రీవాల్ తొలిసారిగా స్పందించారు. ‘ఈ దేశానికి సేవ చేసేందుకు నా జీవితం అంకితం చేశా. జైల్లో ఉన్నా బయట ఉన్నా అది కొనసాగిస్తా’ అని కోర్టు హాలుకు వెళ్తూ ఆయన మీడియాతో అన్నారు.
కేజ్రీవాల్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ : సీఎం అరెస్టుతో దిల్లీ రాజకీయం వేడెక్కింది. ఈ కేసులో ఆయనకు రిమాండ్ విధించినా జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఇప్పటికే ఆప్ నేతలు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని పిటిషనర్ కోరారు. కేజ్రీవాల్ ఓ వ్యక్తి కాదు, సిద్ధాంతమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఆప్ శ్రేణులు ఆయన వెంటే ఉన్నాయని చెప్పారు. అరెస్టు నేపథ్యంలో ఆయన శుక్రవారం ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని మాట్లాడారు. అంతకుముందు ఆప్ నేతలు రోడ్డెక్కారు. బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిరసనలు చేపట్టిన మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. సీఎం కుటుంబసభ్యులను గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు.
సుప్రీంలో పిటిషన్ ఉపసంహరించుకున్న కేజ్రీవాల్ : మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సీఎం ఉపసంహరించుకున్నారు. అనంతరం ఈడీ ఆయనను కోర్టులో హాజరుపర్చింది. తొలుత కేజ్రీవాల్ అభ్యర్థనపై నేడు అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతుందని సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వెల్లడించారు. అయితే, ఈ విచారణ.. ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రొసీడింగ్స్‌తో క్లాష్ అవుతుందని సీఎం తరఫు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. అందువల్ల పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. ట్రయల్ కోర్టు తీర్పునకు అనుగుణంగా మరో పిటిషన్‌తో సుప్రీంను ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈ పరిణామాల అనంతరం కేజ్రీవాల్‌ను ప్రత్యేక కోర్టు ఎదుట అధికారులు హాజరుపర్చారు.
గృహనిర్బంధంలో కుటుంబం : మరోవైపు సీఎం కుటుంబసభ్యులను గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. శుక్రవారం ఉదయం కేజ్రీవాల్ నివాసానికి మంత్రి వెళ్లగా ఆయనను లోనికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీఎం అరెస్టయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు. ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులున్నారు. వారందరినీ కలిసి ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు మమ్మల్ని లోపలికి అనుమతించట్లేదు. ఏ చట్టం కింద వారిని గృహ నిర్బంధంలో ఉంచారు? తప్పుడు కేసులో సీఎంను శిక్షిస్తున్నారు సరే.. ఆయన వృద్ధ తల్లిదండ్రులు, పిల్లలపై కేంద్రానికి ఎందుకింత కక్ష?’’ అని గోపాల్ రాయ్ మండిపడ్డారు.
పోలీసుల అదుపులో మంత్రులు : కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్ నేతలు రోడ్డెక్కారు. బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. నిరసనలు చేపట్టిన ఆప్ మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.